వర్షమొస్తే అధికారులు ఫీల్డ్‌‌‌‌‌‌‌‌లో ఉండాల్సిందే.. లేకుంటే వేటు తప్పదు: సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌

వర్షమొస్తే అధికారులు ఫీల్డ్‌‌‌‌‌‌‌‌లో ఉండాల్సిందే.. లేకుంటే వేటు తప్పదు: సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌
  • వర్షమొస్తే అధికారులు ఫీల్డ్‌‌‌‌‌‌‌‌లో ఉండాల్సిందే.. లేకుంటే వేటు తప్పదు: సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌
  • జూన్ 9 నాటి ట్రాఫిక్ జాంపై తీవ్ర ఆగ్రహం.. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని వార్నింగ్
  • కోర్ అర్బన్ రీజియన్‌‌‌‌‌‌‌‌లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు
  • రైతు వేదికల ద్వారానే యూరియా పంపిణీస్థానిక వ్యవసాయ అధికారితో పాటు 
  • రెవెన్యూ సిబ్బందికి బాధ్యత కలుషిత నీటిపై అలసత్వం వద్దని సూచన
  • వర్షాకాల సన్నద్ధతపై  ఉన్నతాధికారులతో సీఎం రివ్యూ

హైదరాబాద్ , వెలుగు: వర్షమొస్తే అధికారులు ఫీల్డ్‌‌‌‌‌‌‌‌లో ఉండాల్సిందేనని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆదేశించారు. ‘‘వర్షాల సమయంలో ప్రజలు నరకం చూస్తుంటే అధికారులు ఏసీ గదుల్లో కూర్చుంటామంటే కుదరదు. కమిషనర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు మున్సిపల్, పోలీస్ అధికారులు అంతా రోడ్ల పైన ఉండాల్సిందే.. అవసరమైతే నేనూ రోడ్డు మీదికి వస్తా” అని పేర్కొన్నారు. బుధవారం ఎంసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌డీలోని బోధి పెవిలియన్‌‌‌‌‌‌‌‌లో  వర్షాకాల సన్నద్ధతపై  ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి  రివ్యూ నిర్వహించారు.

వర్షాల నేపథ్యంలో అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

సమన్వయ లోపంపై ఆగ్రహం 

ఈ నెల 9న కోర్ అర్బన్ రీజియన్‌‌‌‌లో వర్షం కారణంగా సైబరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడం, నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడటంపై సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినప్పటికీ.. మున్సిపల్, పోలీస్, ట్రాఫిక్ యంత్రాంగం అప్రమత్తం కాకపోవడంపై మండిపడ్డారు.

జూన్ 1నే తాను స్వయంగా సమీక్ష నిర్వహించి సూచనలు చేసినా నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారని నిలదీశారు. అధికారుల మధ్య కనీస సమన్వయం లోపించిందని మండిపడ్డారు. ఈ పరిస్థితికి గల కారణాలను విశ్లేషించి, బాధ్యులైన సంబంధిత అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌ను ఆదేశించారు. మరోసారి ఇలాంటి పునరావృతమైతే సహించేది లేదన్నారు. మానవ తప్పిదాల వల్ల సమస్యలు తలెత్తితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించనని, వాటర్ లాగింగ్ పాయింట్లు, బ్లాక్ స్పాట్ల డేటా ఆధారంగా ముందస్తు వ్యూహంతో సిద్ధం కావాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ విభాగంలోని ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డీజీపీకి సూచించారు.

రైతు వేదికల ద్వారానే యూరియా పంపిణీ

వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్నందున విత్తనాలు, యూరియా పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలని  వ్యవసాయ శాఖకు సీఎం రేవంత్‌‌‌‌ ఆదేశాలు జారీ చేశారు.  రైతు వేదికల ద్వారానే యూరియా పంపిణీ జరగాలని, యూరియా స్టాక్, పంపిణీ బాధ్యతలను స్థానిక వ్యవసాయ అధికారితోపాటు రెవెన్యూ సిబ్బందికి అప్పగించాలన్నారు. సన్న వడ్ల కోసం ప్రకటించిన8 రకాల విత్తనాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.

కలుషిత నీటిపై అలసత్వం వద్దు.. 

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తాగునీరు కలుషితం కాకుండా జలమండలి అధికారులు ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు నిర్వహించాలని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఆదేశించారు. కలుషిత నీటి వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున.. వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి, అవసరమైన మందులను సిద్ధం చేసుకోవాలన్నారు.

శానిటేషన్ సిబ్బంది నిరంతరం పారిశుధ్యాన్ని పర్యవేక్షించాలని సూచించారు. మున్సిపల్, జలమండలి, వైద్య శాఖలను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌‌‌‌ రంజన్.. అలాగే పోలీస్, ట్రాఫిక్, ఫైర్, హైడ్రా, డిజాస్టర్ మేనేజ్‌‌‌‌మెంట్ విభాగాలను డీజీపీ సీవీ ఆనంద్ నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్షలు జరపాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌తో పాటు ఇరిగేషన్, మున్సిపల్, వైద్యారోగ్య, పోలీసు, వ్యవసాయ, వాతావరణ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

హెడ్‌‌‌‌క్వార్టర్స్ వదిలితే కఠిన చర్యలు

రాష్ట్రంలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టుల వద్ద ఇరిగేషన్ అధికారులు మాన్యువల్ ప్రకారం పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి సూచించారు. వర్షాకాలంలో ప్రాజెక్టుల వద్ద సంబంధిత ఇంజినీర్లు తప్పనిసరిగా స్థానికంగానే ఉండాలని, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా హెడ్‌‌‌‌క్వార్టర్స్ వదిలి వెళ్లే ఇంజినీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ కార్యదర్శిని ఆదేశించారు. ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు, నిర్వహణకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయాలని ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు స్పష్టం చేశారు.

కరెంట్ పోతే వెంటనే పునరుద్ధరించాలి 

వర్షం కారణంగా చెట్లు కూలిపోయి పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన జరగాలని, అవసరమైన ప్రాంతాల్లో ‘మొబైల్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మర్లను’ ఏర్పాటు చేయాలని సూచించారు. వర్షం కురిసే సమయంలో విద్యుత్ శాఖ సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.