పోతిరెడ్డిపాడు విస్తరణను అడ్డుకోండి

V6 Velugu Posted on Aug 01, 2021

హైదరాబాద్‌‌, వెలుగు: ఏపీ ప్రభుత్వం అక్రమంగా తలపెట్టిన పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ విస్తరణ, సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌‌ స్కీం పనులను అడ్డుకోవాలని హైదరాబాద్‌‌ రిటైర్డ్‌‌ ఇంజనీర్లు ప్రభుత్వానికి శనివారం లేఖ రాశారు. కేఆర్‌‌ఎంబీ జ్యూరిస్‌‌డిక్షన్‌‌ నిర్ధారిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్​ను తప్పుబట్టారు. కృష్ణా బేసిన్‌‌లో 94.45 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం 18.76 లక్షల ఎకరాలకు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. మిగతా 75.75 లక్షల ఎకరాలకు ఎలాంటి సాగునీటి సదుపాయం లేదన్నారు. మహబూబ్‌‌నగర్‌‌, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్‌‌ సిటీలోని 1.30 కోట్ల మంది కృష్ణా నీళ్లపై ఆధారపడి బతుకుతున్నారని గుర్తుచేశారు. రాష్ట్ర సాగు, తాగునీటి అవసరాల కోసం ఏటా వెయ్యి టీఎంసీల నీళ్లు అవసరమని చెప్పారు. కృష్ణా బేసిన్‌‌ అవసరాలు తీరిన తర్వాతే అవతలి బేసిన్‌‌కు నీళ్లు ఇవ్వాలని బచావత్‌‌ అవార్డు (కేడబ్ల్యూడీటీ) పేజీ నం.127లో స్పష్టంగా పేర్కొందని తెలిపారు.

పర్మిషన్ లేని ప్రాజెక్టులను ఆపాల్సిందే

శ్రీశైలం నుంచి ఏపీ అక్రమంగా నీటిని మళ్లించుకుపోతుండడంతో తెలంగాణలోని కృష్ణా బేసిన్‌‌కు నీళ్లు అందట్లేదన్నారు. ఏపీ రీ ఆర్గనైజేషన్‌‌ యాక్ట్‌‌లోని 11వ షెడ్యూల్‌‌ ప్రకారం, నికర జలాలను వాడుకునే హక్కు రెండు రాష్ట్రాలకు ఉందన్నారు. కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన జ్యూరిస్‌‌డిక్షన్‌‌ నోటిఫికేషన్‌‌ ప్రకారం అనుమతిలేని ప్రాజెక్టులకు రీ ఆర్గనైజేషన్‌‌ యాక్ట్‌‌ ప్రకారం పర్మిషన్ తీసుకోవాలని, అనుమతి లేకుండా పూర్తి చేసిన ప్రాజెక్టులకు 6 నెలల్లోగా పర్మిషన్ రాకుంటే ఆపరేట్‌‌ చేయకుండా సీజ్‌‌ చేయాలని స్పష్టతనిచ్చారని గుర్తుచేశారు. 

ఇప్పటికే 190 టీఎంసీల నీళ్లు కోల్పోయాం

ఏపీ అక్రమంగా నిర్మించిన తెలుగుగంగ, ఎస్‌‌ఆర్బీసీ, నిప్పులవాగు ఎస్కేప్‌‌, ముచ్చుమర్రి లిఫ్ట్‌‌, హంద్రీనీవా లిఫ్ట్‌‌, గాలేరు - నగరి, వెలిగొండ ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే కేటాయింపులు లేకున్నా  నీటిని తీసుకుంటున్నారని తెలిపారు. బచావత్‌‌ అవార్డు తెలంగాణకు 328 టీఎంసీల నీటి అవసరాలు ఉన్నట్టుగా రికార్డు చేసిందని పేర్కొన్నారు. అప్పర్‌‌ కృష్ణా, భీమా, తుంగభద్ర ఎడమ కాలువ ద్వారా మహబూబ్‌‌నగర్‌‌కు గ్రావిటీ ద్వారా దక్కాల్సిన 190 టీఎంసీలు ఆ ప్రాజెక్టులు చేపట్టకపోవడంతో కోల్పోయామని చెప్పారు. తెలంగాణ ఏర్పడే నాటికి పూర్తి చేసిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు బ్రజేశ్‌‌ కుమార్‌‌ ట్రిబ్యునల్‌‌ 75%, 65 శాతం డిపెండబులిటీ ప్రవాహాల ఆధారంగా కేటాయింపులు చేయాలన్నారు. నాగార్జునసాగర్‌‌ ఎడమ కాలువ ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేందుకు ఏపీ 3 కొత్త ప్రాజెక్టులు చేపట్టిందని, దీంతో తెలంగాణకు వాటాగా దక్కాల్సిన నీళ్లు రావడం లేదన్నారు. తాగునీటి అవసరాల కోసం డ్రా చేసే నీటిలో 20 శాతమే లెక్కించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.

Tagged government, Letter, Retired Hyderabad engineers, Potireddipadu head regulator, Sangameshwaram lift scheme

Latest Videos

Subscribe Now

More News