హైదరాబాద్ సీటునూ గెలవాలె : కిషన్ రెడ్డి

హైదరాబాద్ సీటునూ గెలవాలె : కిషన్ రెడ్డి
  •  అసదుద్దీన్​ను పార్లమెంట్​కు పోనియ్యొద్దు 
  • ఎంఐఎం ఎక్కడుంటే అక్కడ రౌడీయిజమే 
  • ఆ పార్టీ ఉన్న చోట అభివృద్ధి జరగదు 
  • బీజేపీకి ముస్లిం మహిళలూ అండగా ఉంటారని వ్యాఖ్య
  • హైదరాబాద్ ఓల్డ్​సిటీలో విజయ సంకల్ప యాత్ర

హైదరాబాద్, వెలుగు:  పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని ఎంపీ సీట్లనూ గెలవాలని బీజేపీ కేడర్ కు కేంద్ర మంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ నియోజకవర్గంలో మజ్లిస్ ను ఓడించి ఆ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలన్నారు. అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంట్ కు వెళ్లకుండా ప్రజాస్వామ్యబద్ధంగా, ఓటు ద్వారానే అడ్డుకోవాలన్నారు. ఎంఐఎం ఉన్న చోట రౌడీయిజం, దోపిడీలు తప్ప అభివృద్ధి ఉండదన్నారు. ఒవైసీ సోదరులు వేల కోట్లు దోచుకున్నారని ఫైర్ అయ్యారు. 

ఆ పార్టీ గెలిచిన చోట ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదన్నారు. బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని కార్వాన్, గోషామహల్, చార్మినార్​ అసెంబ్లీ సెగ్మెంట్లలో కిషన్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. తొలుత నాంపల్లిలోని జైన మందిరాన్ని సందర్శించిన ఆయన.. అక్కడి నుంచి గుడిమల్కాపూర్ వరకు రోడ్ షో చేపట్టారు. అక్కడ కార్వాన్ దర్బార్ మైసమ్మను దర్శించుకుని గోషామహల్​కు రోడ్ షో నిర్వహించారు. 

అక్కడ జుమ్మెరాత్ బజార్​లో ఏర్పాటు చేసిన కార్నర్​ మీటింగ్​లో మాట్లాడారు. ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళలకు మోదీ హక్కులు కల్పించారని.. అందుకే ఓల్డ్ సిటీలో బీజేపీ విజయానికి ముస్లిం మహిళలు కూడా అండగా ఉంటారని చెప్పారు. మజ్లిస్ పార్టీ మెట్రో రైల్ ను అడ్డుకున్నదని విమర్శించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన చేరుతుందన్నారు. 

అందరూ మోదీనే కావాలంటున్నరు.. 

కాంగ్రెస్ పాలనలో దేశంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీ హయాంలో అవినీతి రాజ్యమేలిందన్నారు. మోదీ ప్రధాని అయ్యాక తొమ్మిదిన్నరేండ్లలో ఒక్క రూపాయి అవినీతి కూడా జరగలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సహా ప్రతి ఒక్కరూ కేంద్రంలో బీజేపీ రావాలని కోరుకుంటున్నారని.. అందరూ ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అని అంటున్నారని చెప్పారు. 

నీతి, ధర్మం, దేశం కోసం పనిచేసే నాయకుడు ప్రధాని మోదీ అని అన్నారు. ప్రపంచ దేశాల్లో ఇండియా ప్రతిష్టను మోదీ పెంచారని, అలాంటి నాయకుడే మళ్లీ ప్రధాని కావాలన్నారు. హిందువుల శతాబ్దాల కల అయిన అయోధ్య రామాలయాన్ని మోదీ సాకారం చేశారన్నారు. కాంగ్రెస్​ నేతలు మాత్రం ఎప్పుడూ రామాలయంపై చులకనగానే మాట్లాడారన్నారు. రామాలయం కోసం వేలాది మంది బలిదానం చేశారన్నారు. మోదీ హయాంలో ఒక్క రక్తపు బొట్టు చిందకుండానే బాలరాముడి ప్రతిష్ఠాపన పూర్తయిందన్నారు.