
నింగ్బో (చైనా): ఇండియా స్టార్ షూటర్, హైదరాబాద్ అమ్మాయి ఇషా సింగ్ ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్‌లో తొలి గోల్డ్ మెడల్‌తో మెరిసింది. శనివారం (సెప్టెంబర్ 13) జరిగిన విమెన్స్ 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఇషా ఈ పతకం అందుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో అత్యధికంగా 242.6 స్కోరు చేసిన 20 ఏండ్ల తెలంగాణ షూటర్ కేవలం 0.1 పాయింట్ తేడాతో హోమ్ ఫేవరెట్ యవో క్వియాగ్జున్‌ను ఓడించింది.
యవో సిల్వర్‌తో సరిపెట్టగా.. ఒలింపిక్ చాంపియన్ ఒహ్ వెజిన్ (సౌత్ కొరియా) బ్రాంజ్ నెగ్గింది. మరో ఇండియన్ రిథమ్ సాంగ్వాన్ కూడా ఫైనల్ చేరినా.. 18వ షాట్ తర్వాత పతకం రేసు నుంచి తప్పుకుంది. మెన్స్ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో భవేశ్ షెకావత్, ప్రదీప్ సింగ్, మన్‌దీప్ సింగ్ క్వాలిఫికేషన్ రౌండ్లలోనే ఇంటిదారి పట్టారు.