బోణీ కొట్టిన సన్ రైజర్స్ .. ఢిల్లీపై విక్టరీ

బోణీ కొట్టిన సన్ రైజర్స్ .. ఢిల్లీపై విక్టరీ

‌15 పరుగుల తేడాతో ఢిల్లీపై గెలుపు

రాణించిన రషీద్ ఖాన్‌‌, భువీ

సత్తాచాటిన వార్నర్‌‌, జానీ, కేన్

హమ్మయ్య. ఐపీఎల్‌‌ పదమూడో ఎడిషన్‌‌లో హైదరాబాద్‌‌ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా రెండు ఓటముల తర్వాత గొప్పగా పుంజుకుంది. టేబుల్‌‌ టాపర్‌‌గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌‌ను కిందికి దించి విజయాల ఖాతా తెరిచింది. వార్నర్‌‌, బెయిర్‌‌స్టో, కేన్‌‌ విలియమ్సన్‌‌ రాణించినా స్లో ట్రాక్‌‌పై మోస్తరు స్కోరుకే పరిమితమైన రైజర్స్‌‌.. తన మార్కు బౌలింగ్‌‌తో దాన్ని అద్భుతంగా డిఫెండ్‌‌ చేసుకుంది. చివర్లో రిషబ్‌‌ పంత్‌‌, హెట్‌‌మయర్‌‌ వణికించినా.. పేసర్‌‌ భువనేశ్వర్‌‌, స్పిన్నర్‌‌ రషీద్‌‌ ఖాన్‌‌ కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టును గెలిపించారు.

ఈ మ్యాచ్‌ లో సన్‌‌రైజర్స్‌‌ తరఫున ఐపీఎల్‌‌ అరంగేట్రం చేసిన అబ్దు ల్‌‌ సమద్‌ .. ఈ లీగ్‌ లో ఆడిన జమ్మూ కశ్మీర్‌‌ సెకండ్ ప్లేయర్‌‌. అతని కంటే ముందు ఇండియా క్రికెటర్‌‌ పర్వేజ్‌ రసూల్‌‌ 2013లో పుణె వారియర్స్‌‌ తరఫున ఐపీఎల్‌‌లో ఆడాడు.

అబుదాబి: ఆల్‌‌రౌండ్‌‌ పెర్ఫామెన్స్‌‌తో మెప్పించిన సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ విజయాల బాట పట్టింది. అఫ్గాన్‌‌ స్పిన్‌‌ గన్‌‌ రషీద్‌‌ ఖాన్‌‌ (4–0–14–3), భువనేశ్వర్‌‌ (4–0–25–2) బౌలింగ్‌‌ మెరుపులతో చిన్న టార్గెట్‌‌ను గొప్పగా డిఫెండ్‌‌ చేసుకుంది.  మంగళవారం జరిగిన మ్యాచ్‌‌లో 15  పరుగుల తేడాతో  ఢిల్లీ క్యాపిటల్స్‌‌ను ఓడించింది. టాస్‌‌ ఓడి మొదట బ్యాటింగ్‌‌ చేసిన సన్‌‌రైజర్స్‌‌ 20 ఓవర్లలో  4 వికెట్లకు 162  రన్స్‌‌ చేసింది. బెయిర్‌‌ స్టో (48 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌‌తో 53) హాఫ్‌‌ సెంచరీ చేయగా,  కెప్టెన్‌‌ డేవిడ్‌‌ వార్నర్‌‌ (33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45),  కేన్‌‌ విలియమ్సన్‌‌ (26 బంతుల్లో 5 ఫోర్లతో 41) రాణించారు. అనంతరం ఓవర్లన్నీ ఆడిన ఢిల్లీ 7 వికెట్లకు 147 రన్సే చేసి ఓడింది. ధవన్‌‌ (31 బంతుల్లో 4 ఫోర్లతో 34), రిషబ్‌‌ పంత్‌‌ (27 బంతుల్లో 1 ఫోర్​, 2 సిక్సర్లతో 28) రాణించినా ఫలితం లేకపోయింది. రషీద్​ మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​గా నిలిచాడు.

బెయిర్‌‌స్టో నిదానం.. వార్నర్‌‌, కేన్‌‌ ధనాధన్‌‌

9, 5, 3, 3, 4.. ఫస్ట్‌‌ ఐదు ఓవర్లలో వచ్చిన స్కోర్లివి. అందులో ఒకే ఒక్క ఫోర్‌‌.  దీన్ని బట్టి హైదరాబాద్‌‌ ఇన్నింగ్స్‌‌ ఎంత చప్పగా మొదలైందో చెప్పొచ్చు. గాయం నుంచి కోలుకున్న ఇషాంత్‌‌ (0/26), ఫామ్‌‌లో ఉన్న కగిసో రబాడ (2/21) కట్టుదిట్టమైన బంతులు వేయగా.. ఓపెనర్లు వార్నర్‌‌, బెయిర్‌‌ స్టో శైలికి భిన్నంగా నిదానంగా ఆడారు. ఢిల్లీ  కెప్టెన్‌‌ అయ్యర్‌‌ పక్కా ఫీల్డింగ్‌‌ సెట్‌‌ చేయడంతో వాళ్లు కొట్టిన షాట్స్‌‌ సర్కిల్‌‌ దాటలేకపోయాయి. ఛేంజ్‌‌ బౌలర్లుగా వచ్చిన నోర్జ్‌‌ (0/40),  స్టొయినిస్‌‌  (0/22)కూడా ఇబ్బంది పెట్టడంతో  ఫస్ట్‌‌ ఐదు ఓవర్లో రైజర్స్‌‌ 24 రన్సే చేసింది.  పైగా వార్నర్‌‌ ఓ రనౌట్‌‌ తప్పించుకోగా.. బెయిర్‌‌స్టో  ఇచ్చిన టఫ్‌‌ క్యాచ్‌‌ను శ్రేయస్‌‌ అందుకోకపోవడంతో అతనికీ లైఫ్‌‌ వచ్చింది.  కానీ, నోర్జ్‌‌ వేసిన ఆరో ఓవర్లో వార్నర్‌‌ 6,4 కొట్టి ఇన్నింగ్స్‌‌కు కాస్త ఊపు తెచ్చాడు. ఆపై, మిశ్రా బౌలింగ్‌‌లో ఇంకో సిక్సర్‌‌ రాబట్టి స్కోరు 50 దాటించాడు. మరో ఎండ్‌‌లో  బెయిర్‌‌స్టో వికెట్ల మధ్య వేగంగా రన్‌‌ చేస్తూ స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేయగా డేవిడ్‌‌ జోరు పెంచాడు. ఇషాంత్‌‌ వేసిన 9వ ఓవర్లో స్ట్రెయిట్‌‌ సిక్సర్‌‌ బాదాడు. ఈ టైమ్‌‌లో ఢిల్లీ సీనియర్‌‌ స్పిన్నర్‌‌ అమిత్‌‌ మిశ్రా (2/35)  హైదరాబాద్‌‌కు డబుల్‌‌ స్ట్రోక్‌‌ ఇచ్చాడు. తన వరుస ఓవర్లలో వార్నర్‌‌, మనీశ్‌‌ పాండే (3)లను ఔట్‌‌ చేసి దెబ్బకొట్టాడు. అతని బౌలింగ్‌‌లో  ఓ ఫోర్‌‌ రాబట్టిన వార్నర్‌‌ మరో రివర్స్​ స్వీప్​ ఆడగా బాల్​గ్లోవ్స్‌‌ను కొద్దిగా తాకుతూ కీపర్‌‌ చేతిలో పడింది. దాంతో ఫస్ట్‌‌ వికెట్‌‌కు 77  రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయింది. లాస్ట్‌‌ బాల్‌‌కు బెయిర్‌‌స్టో బౌండ్రీ కొట్టడంతో తొలి పది ఓవర్లలో హైదరాబాద్‌‌ 82/1తో నిలిచింది. కానీ, మిశ్రా వేసిన 12వ ఓవర్లో పాండే పేలవ స్వీప్‌‌ షాట్‌‌ ఆడి రబాడకు క్యాచ్‌‌ ఇచ్చాడు. అక్షర్‌‌ పటేల్‌‌ (0/14)కూడా పొదుపుగా బౌలింగ్‌‌ చేయడంతో రన్‌‌రేట్‌‌ మళ్లీ తగ్గింది. ఢిల్లీ ఫీల్డింగ్‌‌ కూడా సూపర్బ్‌‌గా ఉండడంతో 14వ ఓవర్లకు గానీ జట్టు స్కోరు వంద దాటలేదు. కావాల్సినన్ని వికెట్లున్నా బెయిర్‌‌స్టో నెమ్మదించడంతో హైదరాబాద్‌‌ 150 రన్స్‌‌ చేస్తే గొప్పే అనిపించింది. కానీ,  గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగిన కేన్‌‌ విలియమ్సన్‌‌ స్లాగ్‌‌ ఓవర్లలో  క్లాసిక్‌‌ షాట్లతో అలరించాడు.  నోర్జ్‌‌, స్టొయినిస్‌‌ ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టి ఆటకు ఊపు తెచ్చాడు. అయితే, రబాడ బౌలింగ్‌‌లో డబుల్‌‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న బెయిర్‌‌స్టో అదే ఓవర్లో ఔటవడంతో థర్డ్‌‌ వికెట్‌‌కు 52 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. ఆపై, అరంగేట్రం ప్లేయర్‌‌ అబ్దుల్‌‌ సమద్‌‌ (12 నాటౌట్‌‌).. నోర్జ్‌‌ వేసిన19వ ఓవర్లో  6,4తో స్కోరు 150 దాటించాడు. అయితే, లాస్ట్‌‌ ఓవర్లో కేన్‌‌ను ఔట్‌‌ చేసిన రబాడ  4 రన్సే ఇవ్వడంతో హైదరాబాద్‌‌ మామూలు స్కోరుకే పరిమితమైంది.

ఢిల్లీ దంచలేదు

నార్మల్‌‌ టార్గెట్‌‌ను డిఫెండ్‌‌ చేసుకునే క్రమంలో హైదరాబాద్‌‌కు గొప్ప ఆరంభం లభించింది.  ఫుల్‌‌ఫామ్‌‌లో ఉన్న ఓపెనర్‌‌ పృథ్వీ షా (2)ను ఇన్నింగ్స్‌‌ ఐదో బాల్‌‌కే ఔట్‌‌ చేసిన భువనేశ్వర్‌‌  ఢిల్లీకి షాకిచ్చాడు. ఆఫ్‌‌ స్టంప్‌‌కు దూరంగా వేసిన ఔట్‌‌ స్వింగర్‌‌ను వెంటాడిన షా కీపర్‌‌కు చిక్కాడు. ఖలీల్‌‌ అహ్మద్‌‌ (1/43), నటరాజన్‌‌ (1/29) కూడా మెరుగ్గా బౌలింగ్‌‌ చేయడంతో  మరో ఓపెనర్‌‌ శిఖర్‌‌ ధవన్‌‌  ఇబ్బంది పడ్డాడు.  ఖలీల్‌‌ వేసిన ఐదో ఓవర్లో  ధవన్‌‌, అయ్యర్‌‌  (21 బంతుల్లో 17) చెరో ఫోర్‌‌ కొట్టినా  పవర్‌‌ప్లేలో డీసీ 34/1తో నిలిచింది. ఆ వెంటనే కెప్టెన్‌‌ వార్నర్‌‌ రెండు ఎండ్ల నుంచి  స్పిన్నర్లు అభిషేక్‌‌ వర్మ (0/34), రషీద్‌‌ ఖాన్‌‌లను ప్రయోగించాడు. ఈ ఎత్తుగడ ఫలించింది. 8వ ఓవర్లో తన సెకండ్‌‌ బాల్‌‌కే అయ్యర్‌‌ను ఔట్‌‌ చేసిన రషీద్‌‌ టీమ్‌‌కు బ్రేక్‌‌ ఇచ్చాడు. స్పిన్నర్ల బౌలింగ్‌‌లో ధవన్‌‌, పంత్‌‌ కష్టపడడంతో  తొలి పది ఓవర్లలో ఢిల్లీ 54/2కే పరిమితమైంది. స్పీడు పెంచేందుకు ధవన్‌‌ స్వీప్‌‌, రివర్స్‌‌ స్వీప్‌‌ షాట్లు ట్రై చేసినా కనెక్ట్‌‌ కాలేదు. ఈ క్రమంలో రషీద్‌‌ వేసిన 12వ ఓవర్లో   స్వీప్‌‌ షాట్‌‌ ఆడే ప్రయత్నంలో కీపర్‌‌ బెయిర్‌‌స్టోకు చిక్కాడు. తొలుత అంపైర్‌‌ నాటౌట్‌‌ ఇచ్చినా  డీఆర్‌‌ఎస్‌‌లో  బాల్… బ్యాట్‌‌ ఎడ్జ్‌‌ను తాకినట్టు తేలడంతో శిఖర్‌‌ పెవిలియన్‌‌ బాట పట్టాడు. ఆ వెంటనే పంత్‌‌ కూడా ఔటవ్వాల్సింది. అతనిచ్చిన రిటర్న్‌‌ క్యాచ్‌‌ను అభిషేక్‌‌ వదిలేశాడు. దీనికి ఆ యువ స్పిన్నర్‌‌ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. తర్వాతి రెండు బాల్స్‌‌ను పంత్‌‌ స్టాండ్స్‌‌కు తరలించి ఛేజింగ్‌‌కు ఊపు తెచ్చాడు. అప్పటిదాకా నిదానంగా ఆడిన హెట్‌‌మయర్‌‌ (12 బంతుల్లో 2 సిక్సర్లతో 21)..  ఖలీల్‌‌ వేసిన 15 ఓవర్లో రెండు సిక్సర్లు బాదడంతో ఢిల్లీ ఒక్కసారిగా రేసులోకి వచ్చింది. లాస్ట్‌‌ ఐదు ఓవర్లలో ఆ టీమ్‌‌కు 59 రన్స్‌‌ అవసరం అయ్యాయి. క్రీజులో ఇద్దరు హిట్టర్లు ఉండడంతో ఆ జట్టుకు విజయదారులు కనిపించాయి. నెక్ట్స్‌‌ ఓవర్లో భువీ  స్లో లెంగ్త్‌‌ బాల్‌‌తో హెట్‌‌మయర్‌‌ను వెనక్కుపంపినా.. స్టొయినిస్‌‌ (11), పంత్‌‌ చెరో ఫోర్‌‌ కొట్టారు. అయితే, 17వ ఓవర్లో రషీద్‌‌ ఆటను మలుపు తిప్పాడు.  పంత్‌‌ను ఔట్‌‌ చేసి ఐదు పరుగులే ఇచ్చి రైజర్స్‌‌ శిబిరంలో జోష్‌‌ నింపాడు. దాంతో,  విజయ సమీకరణం 18 బాల్స్‌‌లో 44 రన్స్‌‌గా మారగా.. ఢిల్లీపై ఒత్తిడి పెరిగింది. ఆ వెంటనే స్టొయినిస్‌‌ను ఎల్బీ చేసిన నటరాజన్‌‌ హైదరాబాద్‌‌ విజయం ఖాయం చేశాడు.

హైదరాబాద్‌‌: వార్నర్‌‌ (సి) పంత్‌‌ (బి) మిశ్రా 45,  బెయిర్‌‌స్టో  (సి) నోర్జ్‌‌ (బి) రబాడ 53,  మనీశ్‌‌ (సి) రబాడ (బి)  మిశ్రా 3, విలియమ్సన్‌‌  (సి) అక్షర్‌‌ (బి) రబాడ 41, సమద్‌‌ (నాటౌట్) 12, అభిషేక్‌‌ (నాటౌట్‌‌) 1;

ఎక్స్‌‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 162/4;

వికెట్ల పతనం: 1–77, 2–92, 3–144, 4–160;

బౌలింగ్‌‌:  ఇషాంత్‌‌  3–0–26–0, రబాడ 4–0–21–2, నోర్జ్‌‌ 4–0–40–0, స్టొయినిస్‌‌ 3–0–22–0, మిశ్రా 4–0–35–2, అక్షర్‌‌ 2–0–14–0.

ఢిల్లీ: పృథ్వీ (సి) బెయిర్‌‌స్టో (బి) భువనేశ్వర్‌‌ 2, ధవన్‌‌ (సి) బెయిర్‌‌స్టో (బి) రషీద్‌‌ 34, అయ్యర్‌‌ (సి) సమద్‌‌ (బి) రషీద్‌‌ 17, పంత్‌‌ (సి) గార్గ్‌‌ (బి) రషీద్‌‌ 32, హెట్‌‌మయర్‌‌ (సి) మనీశ్‌‌ (బి) భువనేశ్వర్‌‌ 21, స్టొయినిస్‌‌ (ఎల్బీ) నటరాజన్‌‌ 11, అక్షర్‌‌ (బి) ఖలీల్‌‌ 5, రబాడ (నాటౌట్‌‌) 15, నోర్జ్‌‌ (నాటౌట్‌‌) 3;

ఎక్స్‌‌ట్రాలు: 7;  మొత్తం:  20 ఓవర్లలో 147/7;

వికెట్ల పతనం: 1–2, 2–42, 3– 62, 4– 104, 5–117, 6–126, 7–137 ;

బౌలింగ్‌‌: భువనేశ్వర్‌‌ 4–0–25–2, ఖలీల్‌‌ 4–0–43–1, నటరాజన్‌‌  4–0–29–1, అభిషేక్‌‌ 4–0–34–0, రషీద్‌‌ 4–0–14–3.