- సెప్టెంబర్ 16, 17 తేదీల్లో నిర్వహణ
హైదరాబాద్, వెలుగు: ఇంటర్నేషనల్ జ్యుడీషియరీ కాన్ఫరెన్స్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. సెప్టెంబర్ 16,17 తేదీల్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ జూరిస్ట్ జరుగుతుందని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ చైర్మన్ ఆదిష్ సి.అగర్వాల్ ప్రకటించారు. ఇంటర్నేషనల్ స్థాయిలో జడ్జిలు, అడ్వొకేట్ల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడమే ఈ కాన్ఫరెన్స్ లక్ష్యమని ఆయన వెల్లడించారు. వివిధ దేశాలకు చెందిన 50 మంది జడ్జిలతో పాటు, మన దేశంలోని వివిధ కోర్టుల నుంచి మరో 50 మంది జడ్జిలు హాజరవుతారని తెలిపారు. ఓ దేశంలోని న్యాయ వ్యవస్థలో మంచి సంప్రదాయాల్ని ఇతర దేశాలు స్వీకరించేందుకు ఈ కాన్ఫరెన్స్ ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ఉన్నత న్యాయస్థానాల్లో కేసుల ప్రస్తుత స్థితిని తెలియజేసే డిస్‌ప్లే బోర్డులను 2004లో పాకిస్థాన్‌లో చూసి ఇతర దేశాలు అనుసరిస్తున్నాయని అగర్వాల్ తెలిపారు. అడ్వొకేట్ల భద్రత చట్టంపై కాన్ఫరెన్స్ చర్చిస్తుందన్నారు. కర్నాటక, రాజస్తాన్ లో ఈ చట్టం అమల్లోకి వచ్చిందని, త్వరలో తెలంగాణలో వస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. సమావేశ నిర్వహణకు సీఎం కేసీఆర్ పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నామని అగర్వాల్ చెప్పారు. ఈ సమావేశంలో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, హైకోర్టు బార్ అసోసియేషన్ చైర్మన్ పల్లె నాగేశ్వర్‌రావు, హెచ్‌సీఏఏ మాజీ చైర్మన్ పొన్నం అశోక్‌గౌడ్, ఉపాధ్యక్షుడు చెంగల్వ కల్యాణ్‌రావు, కార్యదర్శులు పులి దేవేందర్, కె.ప్రదీప్‌రెడ్డి, కోశాధికారి వెంగల పూర్ణశ్రీ, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ బైరెడ్డి, కార్యవర్గ సభ్యులు నాగులూరి క్రిష్ణకుమార్ గౌడ్, చైతన్య లత పాల్గొన్నారు.

