- మార్చి 23 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు టోర్నీలు
- ఈవెంట్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్‌గా డీజీపీ
హైదరాబాద్, వెలుగు: 74వ బీఎన్ మల్లిక్ మెమోరియల్ అఖిల భారత పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 వరకు 12 రోజుల పాటు జరగనున్న ఈ మెగా టోర్నీలో దేశవ్యాప్తంగా 53 జట్లు పాల్గొననున్నాయి. బుధవారం అధికారులతో డీజీపీ శివధర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈవెంట్ ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. దానికి డీజీపీ శివధర్ రెడ్డి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
సెక్రటరీగా సైబరాబాద్ సీపీ ఎం. రమేశ్, అడ్మినిస్ట్రేషన్ కమిటీ సభ్యులుగా ఐపీఎస్ అధికారులు అభిలాషా బిస్త్, అనిల్ కుమార్, సంజయ్ కుమార్ జైన్, వి.సి. సజ్జనార్, అవినాశ్ మహంతి, గజరావు భూపాల్ వ్యవహరిస్తారు. డీజీపీ మాట్లాడుతూ.. టోర్నీలో దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 11 కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, ఆరు సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ల నుంచి మొత్తం 53 జట్లు పాల్గొంటాయని వెల్లడించారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం, అజీజ్ నగర్‌లోని ఎచ్‌ఎఫ్‌సీ గ్రౌండ్, మొయినాబాద్‌లోని శ్రీనిధి ఫుట్‌బాల్ క్లబ్ గ్రౌండ్‌లో పోటీలు జరగనున్నాయి.
