
హైదరాబాద్, వెలుగు: మరో ఇంటర్నేషనల్ మెగా ఈవెంట్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. విమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ రెండో ఎడిషన్ భాగ్యనగరంలో జరగనుంది. ఆగస్టు 3 నుంచి 10 వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు నిర్వహించనున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ మెగా టోర్నీ బీహార్‌లో జూన్‌లోనే జరగాల్సి ఉంది. కానీ, ఆతిథ్య బాధ్యతలను బీహార్ వదులుకోవడంతో ఆలస్యమైంది. ఈ ఈవెంట్‌ను నిర్వహించేందుకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ముందుకు రావడంతో హైదరాబాద్‌కు కేటాయించారు.
2005లో హైదరాబాద్‌లో ఆసియా కబడ్డీ చాంపియన్‌షిప్ జరగ్గా.. 20 ఏండ్ల తర్వాత మరో ఇంటర్నేషనల్ విమెన్స్ కబడ్డీ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్నామని తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాసాని వీరేష్ తెలిపారు. కాగా, ఈ టోర్నమెంట్‌లో 14 దేశాలు పాల్గొంటాయి. ఆతిథ్య దేశం ఇండియాతో పాటు అర్జెంటీనా, బంగ్లాదేశ్, చైనీస్ తైపీ, జర్మనీ, హాలాండ్, ఇరాన్, జపాన్, కెన్యా, నేపాల్, థాయ్‌లాండ్, ఉగాండా, జాంజిబార్ జట్లు తమ రాకను ఖరారు చేశాయి. పోలాండ్ మాత్రమే తమ ఎంట్రీని కన్ఫామ్ చేయాల్సి ఉంది. ఈ టోర్నీ తొలి ఎడిషన్ 2012లో పాట్నాలో జరగ్గా అప్పుడు ఇండియానే విజేతగా నిలిచింది. 13 ఏండ్ల గ్యాప్ తర్వాత తిరిగి మొదలవుతున్న ఈవెంట్‌లో ఆతిథ్య జట్టే ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.