హైదరాబాద్ సిటీ, వెలుగు: ఈ ఎండాకాలం కుక్కల దూపను తీర్చేందుకు నగరంలో మరిన్ని నీటి తొట్టీలు ఏర్పాటు చేస్తున్నారు. చిన్న కాలనీలు అయితే ఒకచోట, కాస్త పెద్దగా ఉండి కుక్కలు ఎక్కువగా ఉంటే రెండు చోట్ల తొట్టీలను నిర్మిస్తున్నారు. సమ్మర్ లో కుక్కలకు నీళ్లు దొరక్క వింతగా ప్రవర్తిస్తూ మనుషులపై దాడి చేస్తున్నాయి. నీళ్లు లేక ఒక కాలనీ నుంచి మరొక కాలనీకి మైగ్రేట్అవుతుండడంతో వాటి మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి. ఆ సమయంలోనే మనుషులపై దాడులు చేస్తున్నాయి.
దీనికి పరిష్కారంగా బల్దియా అధికారులు గత రెండేండ్లుగా నీటి తొట్టీలను ఏర్పాటు చేయడం మొదలుపెట్టింది. అయితే, ఈసారి మూడు కార్పొరేషన్ల పరిధిలో సుమారు10 వేల వరకు తొట్టీలు ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఎవరైనా వలంటీర్లు ముందుకు వచ్చినా వారికీ అవకాశం ఇస్తున్నారు. జీహెచ్ఎంసీలో ఇప్పటికే మొదలుపెట్టగా, ఎంఎంసీ, సీఎంసీల్లో వచ్చే వారం నుంచి స్టార్ట్ చేయనున్నారు. అలాగే, తొట్టీల్లో నీళ్లను పోసే బాధ్యతలను ఆయా ఏరియాల్లోని చిరు వ్యాపారులకు అప్పగిస్తున్నారు. ఎవరూ లేకపోతే మున్సిపల్ సిబ్బందికి బాధ్యతలు అప్పజెప్తున్నారు.
