కరోనా ముందు స్థాయికి చేరిన హైదరాబాద్‌‌‌‌  మార్కెట్‌‌‌‌

కరోనా ముందు స్థాయికి చేరిన హైదరాబాద్‌‌‌‌  మార్కెట్‌‌‌‌
  • గచ్చిబౌలి, తెల్లాపూర్‌‌‌‌‌‌‌‌, దుండిగల్‌‌‌‌, నల్లగండ్ల, మేడ్చల్‌‌‌‌, కొంపల్లిలో ఎక్కువ లాంచ్‌‌‌‌లు
  • ఆఫీస్‌‌‌‌ స్పేస్‌‌‌‌కూ పెరుగుతున్న గిరాకీ

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: దేశంలోని మిగిలిన మెట్రో సిటీలతో పోలిస్తే హైదరాబాద్‌‌‌‌లో  అపార్ట్‌‌‌‌మెంట్ల​ అమ్మకాలు ఎక్కువగా జరిగాయని  ప్రాపర్టీస్‌‌‌‌ కన్సల్టన్సీ కంపెనీ జేఎల్ఎల్‌‌‌‌ పేర్కొంది. కిందటేడాది 15,787 అపార్ట్‌‌‌‌మెంట్ యూనిట్లు సిటీలో అమ్ముడయ్యాయని వివరించింది. అంతేకాకుండా  అక్టోబర్‌‌‌‌‌‌‌‌-– డిసెంబర్‌‌‌‌‌‌‌‌ ( క్యూ4)  టైమ్‌‌‌‌లో   కొత్తగా అందుబాటులోకి వచ్చిన రెసిడెన్షియల్ యూనిట్లు కూడా పెరిగాయని ఈ సంస్థ పేర్కొంది. కొత్తగా లాంచ్‌‌‌‌ అయిన రెసిడెన్షియల్ యూనిట్లు  హైదరాబాద్‌‌‌‌లో 26.1 శాతం పెరిగాయని తెలిపింది. ఆ తర్వాత పుణే (17.6 శాతం), బెంగళూరు (16.4 శాతం), ముంబై (16.1 శాతం) సిటీలు టాప్‌‌‌‌లో ఉన్నాయి.  బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ఎన్‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌, కోల్‌‌‌‌కతా, ముంబై, పుణే రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ మార్కెట్ల  నుంచి డేటాను సేకరించి జేఎల్‌‌‌‌ఎల్‌‌‌‌ ఈ రిపోర్ట్‌‌‌‌ రెడీ చేసింది. ఈ రిపోర్ట్‌‌‌‌లో  విల్లాలు, ప్లాట్‌‌‌‌లు వంటి ఇతర రెసిడెన్షియల్ యూనిట్ల సేల్స్ డేటాను తీసుకోలేదు. కేవలం అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ సేల్స్‌‌‌‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. మరోవైపు 3 బీహెచ్‌‌‌‌కే (3 బెడ్‌‌‌‌రూమ్స్‌‌‌‌) ఫ్లాట్‌‌‌‌లపై డెవలపర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని, కొత్తగా లాంచ్ అయిన అపార్ట్‌‌‌‌మెంట్లలో వీటి వాటా 52 శాతంగా ఉందని సిటీకి చెందిన  రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ డెవలపర్ ఒకరు అన్నారు.  గచ్చిబౌలి, తెల్లాపుర్‌‌‌‌‌‌‌‌, దుండిగల్‌‌‌‌, నల్లగండ్ల, మేడ్చల్‌‌‌‌, కొంపల్లి వంటి ఏరియాల్లో కొత్త ప్రాజెక్టులు ఎక్కువగా లాంచ్ అయ్యాయని తెలిపారు. 

కరోనా ముందు స్థాయికి..
రెసిడెన్షియల్ యూనిట్ల అమ్మకాల్లో హైదరాబాద్‌‌‌‌  మార్కెట్‌‌‌‌ కరోనా ముందు స్థాయిలకు చేరుకుందని  జేఎల్‌‌‌‌ఎల్‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌ వెల్లడించింది. 2019 లో సిటీలో 15,805 అపార్ట్‌‌‌‌మెంట్లు సేల్ అయ్యాయి. కరోనా వలన 2020 లో ఈ సంఖ్య 9,926 యూనిట్లకు తగ్గింది. 2021 లో సిటీలో 15,787 యూనిట్లు అమ్ముడయ్యాయని జేఎల్‌‌‌‌ఎల్‌‌‌‌ పేర్కొంది. ‘ఎకానమీ రికవరీ అవుతుందనే అంచనాల నేపథ్యంలో రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో సెంటిమెంట్ మెరుగుపడుతోంది. దీంతో డెవలపర్లలో కాన్ఫిడెన్స్‌‌‌‌ పెరుగుతోంది. వివిధ సిటీలలో కొత్త ప్రాజెక్ట్‌‌‌‌ల లాంచ్‌‌‌‌లు పెరుగుతున్నాయి’ అని ఈ రిపోర్ట్ తెలిపింది. హైదరాబాద్‌‌‌‌, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ఎన్‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌, కోల్‌‌‌‌కతా, ముంబై, పుణే సిటీలలో క్యూ4 లో మొత్తం 45,383 అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ యూనిట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయని పేర్కొంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 38 శాతం అధికం. ఎక్కువ లాంచ్‌‌‌‌లు పుణే (19 శాతం), బెంగళూరు, హైదరాబాద్‌‌‌‌ (17 శాతం చొప్పున) సిటీలలోనే జరిగాయని జేఎల్‌‌‌‌ఎల్ రిపోర్ట్ పేర్కొంది. కాగా,  కిందటేడాది రియల్‌‌‌‌ ఎస్టేట్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో 1.28 లక్షల యూనిట్ల  రెసిడెన్షియల్ యూనిట్లు అమ్ముడయ్యాయి. కాగా, కిందటేడాది హైదరాబాద్‌లో  రూ. 25,330 కోట్ల విలువైన ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు జరిగాయి. సంఖ్య పరంగా చూస్తే, మొత్తం 44,278 ప్రాపర్టీలు రిజిస్టర్‌‌‌‌‌‌‌‌ అయ్యాయని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. 2020 తో పోలిస్తే ఇది 96 శాతం ఎక్కువ. 

కమర్షియల్ స్పేస్‌‌‌‌లోనూ ముందే
రెసిడెన్షియల్ మార్కెట్‌‌‌‌లోనే కాకుండా కమర్షియల్ సెగ్మెంట్‌‌‌‌లో కూడా హైదరాబాద్‌‌‌‌ రియల్‌‌‌‌ఎస్టేట్ మార్కెట్ దూసుకుపోతోంది. బెంగళూరుకి ప్రత్యామ్నాయంగా కమర్షియల్ డెస్టినేషన్‌‌‌‌గా ఎదుగుతోంది. మోతిలాల్‌‌‌‌ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌‌‌ రిపోర్ట్ ప్రకారం, ఐటీ, ఐటీ రిలేటెడ్ సెక్టార్‌‌‌‌‌‌‌‌ కంపెనీలే  కమర్షియల్‌‌‌‌ స్పేస్‌‌‌‌ను ఎక్కువగా  (55 శాతం వాటా) వాడుతున్నాయి.  హైదరాబాద్‌‌‌‌, బెంగళూరు, పుణే సిటీలలో కమర్షియల్ స్పేస్‌‌‌‌కు ఎక్కువగా డిమాండ్ ఉందని ఈ రిపోర్ట్ పేర్కొంది. ఈ సిటీలు ఐటీ సెక్టార్‌‌‌‌‌‌‌‌కు హబ్‌‌‌‌గా మారడంతో  ఇక్కడ కమర్షియల్ స్పేస్‌‌‌‌కు డిమాండ్‌‌‌‌ పెరుగుతోందని తెలిపింది. ఇప్పటి వరకు లీజుకు తీసుకున్న లేదా అమ్ముడయిన ఆఫీస్ స్పేస్‌‌‌‌లలో 45–55 శాతం వాటా  హైదరాబాద్‌‌‌‌, బెంగళూరు, పుణే సిటీలదే ఉందని వివరించింది. హైదరాబాద్‌‌‌‌లో చాలా మంది సౌత్ ఇండియా డెవలపర్లు తమ ప్రాజెక్ట్‌‌‌‌లను విస్తరించడానికి రెడీ అవుతున్నారని ఈ సంస్థ వివరించింది. ఇక్కడ రియల్ ఎస్టేట్‌‌‌‌ మార్కెట్ బలంగా ఉండడంతో  డిమాండ్ కంటే ఎక్కువ ప్రాజెక్ట్‌‌‌‌లు లాంచ్ అవుతున్నాయని పేర్కొంది..