2027 డిసెంబర్ నాటికి ‘గోదావరి’ పూర్తి

2027  డిసెంబర్ నాటికి ‘గోదావరి’ పూర్తి

హైదరాబాద్ సిటీ, వెలుగు: గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్–2, ఫేజ్–3 పనులను 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని వాటర్‌ బోర్డ్ ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరానికి 20 టీఎంసీల అదనపు నీటిని తరలించడంతో పాటు, మూసీ పునరుజ్జీవనం కోసం జంట జలాశయాలను గోదావరి నీటితో నింపేందుకు రూ.7,360 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్​ మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణ పనులు చేపట్టినట్టు తెలిపారు. 

ఈ పనుల పురోగతిపై గురువారం ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఆయన సమీక్షించారు. మల్లన్న సాగర్ నుంచి ఘన్‌పూర్, అక్కడి నుంచి ఉస్మాన్ సాగర్ వరకు చేపట్టాల్సిన పైప్‌లైన్ విస్తరణ పనులు, ఘన్‌పూర్ వద్ద నిర్మించనున్న 80 ఎంఎల్‌డీ మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఘన్‌పూర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ల వద్ద నిర్మించే నీటి శుద్ధి కేంద్రాల పనుల్లో వేగం పెంచాలని సూచించారు. 

పైప్‌లైన్ విస్తరణ, నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణ పనులను ఏకకాలంలో చేపట్టి ప్రాజెక్టును నిర్ణీత గడువులో పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ శ్రీధర్, సీజీఎమ్ మహేష్ కుమార్‌తో పాటు సంబంధిత అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.