హైదరాబాద్ వేదికగా జీ20 అగ్రికల్చర్ సమ్మిట్
జూన్ 15 నుంచి 17 వరకు జరగనున్న సదస్సు
హాజరుకానున్న 30 దేశాల అగ్రికల్చర్ మినిస్టర్లు
హైదరాబాద్, వెలుగు : ఇండియా సారథ్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 దేశాల సదస్సుల్లో అగ్రికల్చర్ సమ్మిట్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ ఏడాదిని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్స్‌ను ప్రోత్సహించేలా సదస్సు నిర్వహించనున్నారు. నేషనల్, ఇంటర్నేషనల్ ఎక్స్‌పర్ట్స్ ను రాష్ట్ర అధికారులతో కో ఆర్డినేషన్ చేస్తూ సమ్మిట్ సన్నాహక ఏర్పాట్లు షురూ చేశారు. రాష్ట్ర వ్యవసాయశాఖ ఈ బాధ్యతలు చేపట్టింది.
మూడు రోజుల పాటు సమ్మిట్
జూన్ 15 నుంచి 17వ తేదీ వరకు హైదరాబాద్ హైటెక్ సిటీలో మూడు రోజుల పాటు జీ20 అగ్రికల్చర్ సమ్మిట్ జరుగనుంది. ఇండియాలో అగ్రికల్చర్‌కు సంబధించి ఇప్పటి వరకు మూడు జీ20 సదస్సులు జరిగాయి. మొదటి సదస్సు ఫిబ్రవరిలో మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్ లో నిర్వహించగా, రెండో సదస్సు(అగ్రికల్చర్ డిప్యూటీస్ మీటింగ్) మార్చి నెలాఖరులో చండీగఢ్‌లో జరిగింది. మూడోది (అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్టుల సదస్సు) ఏప్రిల్ మూడో వారంలో వారణాసిలో మూడు రోజులపాటు జరిగింది. తాజాగా నాలుగో అగ్రికల్చర్ సమ్మిట్ హైదరాబాద్‌లో జరుగనుంది.
హాజరు కానున్న 30 దేశాల ప్రతినిధులు
ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలకు చెందిన అగ్రికల్చర్ మినిస్టర్లు పాల్గొననున్నారు. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, కెనడా, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఇటలీ, ఫ్రాన్స్ , ఇండియా, జర్మనీ, జపాన్, కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, టర్కీ, యూకే, యూఎస్‌ఏ, యూరోపియన్ యూనియన్ తదితర దేశాల నుంచి హాజరు కానున్నారు. అలాగే బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, ఒమన్, నైజీరియా, సింగపూర్, స్పెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వియత్నాం వంటి 10 దేశాలను కూడా ఆహ్వానించారు. యునైటెడ్ నేషన్స్‌కు చెందిన ప్రపంచ స్థాయి మెట్ట పరిశోధన సంస్థ ఇక్రిశాట్, ఓఈసీడీ, ఏడీబీతో పాటు ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సంస్థలు, వరల్డ్‌బ్యాంక్ సంస్థల ప్రతినిధులు ఈ సమ్మిట్‌కు హాజరుకానున్నారు. ఆధునిక సాంకేతిక, వినూత్న ఆవిష్కరణలను ఈ సమ్మిట్‌లో ప్రదర్శించే అవకాశముంది.
