హైదరాబాద్: ఉప్పల్ పరిధిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉప్పల్‌లోని బీరప్పగడ్డ స్మశాన వాటికలో అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. స్మశాన వాటిక పరిసరాల్లో దుర్వాసన రావడంతో డెడ్ బాడీని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఉప్పల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం మృతుడు సుమారు 35 సంవత్సరాల వయస్సు కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
మృతదేహం కుళ్లిన స్థితిలో ఉండటంతో, సుమారు నాలుగు నుంచి ఐదు రోజుల క్రితమే మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే, ఇది సహజ మరణమా లేక ఎవరైనా హత్య చేసి ఇక్కడ పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీంను పిలిపించి సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
