రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దొంగతనాలకు పాల్పడటం కలకలం రేపింది. ఈజీ మనీ కోసం నడుస్తున్న ట్రెయిన్స్ లో దొంగతనాలకు పాల్పడుతున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని గురువారం సికింద్రాబాద్ (ఏప్రిల్ 09) జీఆర్పీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుని వద్ద నుండి సుమారు 45 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు
వివరాల్లోకి వెళ్తే.. నాగారంకు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి శ్రీనివాస్ రెడ్డి.. బెట్టింగ్ కు పాల్పడుతూ.. నష్టాలను కవర్ చేసుకునేందుకు రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయాడు. షేర్ మార్కెట్ బెట్టింగ్లకు పాల్పడుతూ డబ్బులు లేకపోవడంతో రైళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సెక్యూరిటీ గార్డ్ ఇన్చార్జిగా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి ఏప్రిల్ 2వ తేదీ కాకతీయ ఎక్స్ ప్రెస్ లో దొంగతనానికి పాల్పడినట్లు చెప్పారు.
ఓ మహిళ మెడలో నుండి గోల్డ్ చైన్ కొట్టేసి పారిపోయాడు. మహిళ అప్రమత్తమై ఎదిరించగా సగం బంగారపు గొలుసు తెంపుకొని పారిపోయినట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. మరుసటి రోజు కూడా అదే కాకతీయ ఎక్స్ ప్రెస్ లో మరో మహిళ మెడలో నుండి మంగళసూత్రాన్ని లాకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ నెంబర్ నాలుగులో అనుమానాస్పదంగా తిరుగుతున్న శ్రీనివాస్ రెడ్డిని జీ ఆర్ పీ, ఆర్పీఎఫ్ పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
