
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ ప్రతిష్టాత్మక ఫిడే చెస్ వరల్డ్ కప్ కు ఎంపికయ్యాడు. యూఏఈలోని అల్ ఐన్‌లో జరిగిన ఆసియా చెస్ చాంపియన్‌షిప్ లో ఆరో ప్లేస్ సాధించడం ద్వారా తను వరల్డ్ కప్ బెర్తు దక్కించుకున్నాడు. శుక్రవారం ముగిసిన ఆసియా చెస్ టోర్నీలో 33వ సీడ్‌గా బరిలోకి దిగిన రాజా రిత్విక్ 9 రౌండ్లలో 5 గేమ్‌లు గెలిచి, 3 డ్రా చేసుకుని, ఒక గేమ్‌లో ఓడిపోయాడు.
మొత్తం 6.5 పాయింట్లతో 6వ స్థానం సాధించాడు. కాగా, ఇండియా నుంచి రిత్విక్‌తో పాటు మరో ఆరుగురు వరల్డ్ కప్ బెర్త్ సాధించారు. ఈ లిస్ట్‌లో జీఎంలు నిహాల్ సరిన్, పా ఇనియన్, ఎస్‌ఎల్ నారాయణన్, ఎం. ప్రణేశ్, మురళీ కార్తికేయన్‌తో పాటు ఇంటర్నేషనల్ మాస్టర్ జీబీ హర్షవర్దన్ ఉన్నారు.