హైదరాబాద్లోని ఈ కొండలు, గుట్టలు సేఫ్.. త్వరలో చుట్టూ కంచె.. రంగంలోకి హైడ్రా కమిషనర్

హైదరాబాద్లోని ఈ కొండలు, గుట్టలు సేఫ్.. త్వరలో చుట్టూ కంచె.. రంగంలోకి హైడ్రా కమిషనర్

రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్లో ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝుళిపించింది. అక్కమార్కులు బొక్కేయకుండా భూములను కాపాడే పనిలో హైడ్రా సీరియస్గా ముందుకెళుతోంది. గండిపేట మండలంలోని పుప్పాలగూడలో ఉన్న ప్రభుత్వ భూమిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం పరిశీలించారు. 2 వందల ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా చుట్టూ కంచె ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ తెలిపారు. ఇక్కడ దేవాలయాలకు, దర్గాకు 10 ఎకరాల వరకూ భూమి ఇచ్చినట్టు చెబుతున్నారని.. దీనిని కూడా రెవెన్యూ వాళ్లతో కలిసి పరిశీలిస్తామని ఆయన చెప్పారు. ఆ మేరకు హద్దులు నిర్ధారించి త్వరలో కంచెలు వేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు.

452/1, 454/1 సర్వే నంబర్లలో ఉన్న కొండలను పరిరక్షించాలని కోరుతూ హైడ్రాకు సేవ్ రాక్స్ సొసైటీ ప్రతినిధులు కోరారు. ఎంతో ఎత్తుగా.. సహజ సిద్ధంగా ఉన్న గుట్టలను, సంవత్సరాల చరిత్ర గల కొండలను కాపాడితే.. ప్రకృతిని పరిరక్షించనవాళ్లం అవుతామని రంగనాథ్ ఈ సందర్భంగా చెప్పారు. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే హైకోర్టు ఉత్తర్వులను కూడా పరిశీలిస్తామని హైడ్రా కమిషనర్ తెలిపారు. ఈ గుట్టలను ఆనుకుని ఉన్న భగీరథమ్మ చెరువును కూడా పరిరక్షించాలని రంగనాథ్ను స్థానికులు కోరారు.

అయితే.. గతంలో కూడా భగీరథమ్మ చెరువు కబ్జాలపై హైడ్రా చర్యలు తీసుకుంది. ఖాజాగూడ మెయిన్​రోడ్డుకు ఆనుకొని ఉన్న భగీరథమ్మ చెరువు శిఖం స్థలాన్ని కొందరు కబ్జా చేస్తున్నారని గుర్తించిన హైడ్రా అధికారులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు మట్టిపోసి చదును చేస్తున్నవారిని, జేసీబీ ఓనర్​సురేశ్ను అరెస్ట్​చేశారు.