
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాల కబ్జాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చుడే ఆలస్యం..వెంటనే అక్కడికి వెళ్లి నిర్ధారించుకుని ఆక్రమణల భరతం పడుతోంది. ప్రభుత్వ ఆస్తులను, స్థలాలను పరిరక్షిస్తోంది.
లేటెస్ట్ గా జులై 29న హైదరాబాద్ లోని మూసాపేట, ఆంజనేయనగర్లో ఆక్రమణలు తొలగించింది హైడ్రా. రెండు వేల గజాల పార్కు స్థలాన్ని పార్కు స్థలాన్ని కబ్జా చేసి టెంట్ హౌజ్ దుకాణం నిర్వహిస్తున్నాడు యాసిన్ అనే వ్యక్తి. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన హైడ్రా.. హుడా లేఔట్ ప్రకారం రెండు వేల గజాలను పార్కు కోసం కేటాయించిన స్థలంగా నిర్ధారించారు .కబ్జా చేసి నిర్మించిన టెంట్ హౌజ్ ను కూల్చివేశారు హైడ్రా అధికారులు.
గతంలో ఈ పార్కు అభివృద్ధికి రూ. 50 లక్షలు విడుదల చేసింది జీహెచ్ఎంసీ. పార్కు చుట్టూ ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన వారిని అడ్డుకున్నారు కబ్జాదారులు. జీహెచ్ఎంసీ, పోలీస్ స్టేషన్లో కబ్జాలపై ఫిర్యాదు చేశారు స్థానికులు. ఇటీవల హైడ్రా ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేశారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి కబ్జాలు తొలగించింది హైడ్రా. లే ఔట్ ప్రకారం పార్కును ఆభివృద్ధి చేయాలంటూ స్థానికుల డిమాండ్ చేస్తున్నారు.
హైడ్రాపై ప్రశంసలు
స్థానికుల ఫిర్యాదుతో వెంటనే ఆక్రమణలను తొలగిస్తోన్న హైడ్రా అధికారుల పని తీరుపై నగర వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి . ప్రభుత్వం కూడా హైడ్రాను ప్రోత్సహిస్తోంది. ఈ ఏడాది బట్జెట్లో హైడ్రాకు రూ.100 కోట్లు కేటాయించగా, అందులో ఇదివరకే రూ.25 కోట్లను ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇప్పుడు మరో రూ.25 కోట్లు విడుదల చేయగా.. మరో రూ.50 కోట్లు విడుదల చేయాల్సి ఉంది.