
హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. జన చైతన్య వెంచర్ సమీపంలో దాదాపు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు కొందరు భూ బకాసురులు. ఈసీ వాగుకు అనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఏకంగా అందులో వెంచర్ వేశారు. ప్రభుత్వ భూమి కబ్జా అయినట్లు స్థానికుల ద్వారా తెలుసుకున్నారు హైడ్రా అధికారులు. ఈ మేరకు బుధవారం (అక్టోబర్ 15) ఉదయం స్పాట్‌కు చేరుకుని ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్‌ను కూల్చివేశారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. కాగా, ఇదే స్థలాన్ని గతంలో కూడా కబ్జా చేసి వెంచర్ చేశారు కొందరు కబ్జాదారులు. గుర్తించిన రెవెన్యూ అధికారులు వెంచర్‌ను కూలగొట్టగా.. మళ్లీ వెంచర్ ఏర్పాటు చేశారు కబ్జాదారులు. ఈసారి హైడ్రా రంగంలోకి దిగి అక్రమ వెంచర్‌ను నేలమట్టం చేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది.