సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో కబ్జా దారులపై హైడ్రా కొరడా ఝులిపిస్తోంది. ఐలాపురం గ్రామంలోని ప్రభుత్వ భూములను కాపాడేందుకు రంగంలోకి దిగిన అధికారులు.. నిబంధనలను తుంగలో తొక్కిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు.1998 నుంచి కోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ.. లెక్కచేయకుండా నిర్మించిన ముఖీం గెస్ట్ హౌస్‌ను హైడ్రా అధికారులు కూల్చివేశారు.
860 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు
ఐలాపురం గ్రామంలో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. అందులో ఇప్పటికే అనేక నివాసాలు వెలిశాయి. ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆ నివాసాలను వదిలేసి.. మిగిలిన 860 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడటమే హైడ్రా ముఖ్య ఉద్దేశ్యం. ప్రస్తుతం స్వాధీనం చేసుకుంటున్న ఈ భూమి విలువ మార్కెట్ ధర ప్రకారం అక్షరాలా 15 వేల కోట్ల రూపాయల పైమాటే అని అధికారులు అంచనా వేస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమన్వయంతో సాగుతున్న ఈ ఆపరేషన్ అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. సామాన్యుల ఇళ్లకు ఏ డోకా లేదని కేవలం భారీ కబ్జాలనే టార్గెట్ చేశామని హైడ్రా తెలిపింది.
ఆరంతుస్థుల బిల్డింగ్ కూల్చివేత
అలాగే ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన ముఖీం సోదరుడు అజీమ్‌కు చెందిన ఆరు అంతస్తుల భారీ భవనాన్ని కూడా అధికారులు నేలమట్టం చేశారు. అయితే ఈ ఆపరేషన్‌లో పేదలు నివసించే ఇళ్ల జోలికి వెళ్లకూడదని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు.. ఐలాపురం తండాలోని నివాసాలను తాకకుండా హైడ్రా జాగ్రత్తలు తీసుకుంది. కేవలం కబ్జాకు గురైన ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగుతోంది.
