రూ.10 లక్షల కోట్ల విలువైన భూములు కాపాడినం : హైడ్రా కమిష నర్ రంగనాథ్

రూ.10 లక్షల కోట్ల విలువైన భూములు కాపాడినం : హైడ్రా కమిష నర్ రంగనాథ్
  •     హైడ్రా కమిషనర్ రంగనాథ్
  •     మిర్యాలగూడలో డిప్యూటీ సీఎం సీపీఆర్వో మధుసూదన్​ దశ దినకర్మకు హాజరు 

నల్గొండ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా పాలసీ సత్ఫలితాలను ఇస్తోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో డిప్యూటీ సీఎం సీపీఆర్వో మారబోయిన మధుసూదన్ దశ దినకర్మ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్​లో రూ.10 లక్షల కోట్ల విలువైన 2,100 ఎకరాల భూమిని కాపాడామని తెలిపారు. అక్రమ కట్టడాల విషయంలో ఎవరినీ ఉపేక్షించడం లేదన్నారు. కాంగ్రెస్, ఎంఐఎంతోపాటు వివిధ పార్టీలకు చెందిన నాయకుల అక్రమ కట్టడాలను కూల్చివేసినట్లు చెప్పారు. ఇటీవల అమీన్‌‌పూర్‌‌లో ముఖిమ్ సంధ్య శ్రీధర్ రావు, మల్లారెడ్డికి సంబంధించిన భూములను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. 

నగరంలోని అన్ని చెరువులను కాపాడాలన్న లక్ష్యంతో  హైడ్రా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోందని చెప్పారు. ఇప్పటికే 25 చెరువులను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకున్నామని, మరో 100 చెరువులను స్వాధీనం చేసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ.. చట్టబద్ధంగానే అక్రమ కట్టడాలను తొలగిస్తున్నామన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూ బకాసురుల చెర నుంచి స్వాధీనం చేసుకున్న భూముల్లో రెండేళ్లలో వాకింగ్ ట్రాక్‌‌లు, ఫిజికల్ యాక్టివిటీ పార్క్​లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు కూడా హైడ్రా సేవలు విస్తరించాలని 30 వేలకు పైగా అర్జీలు వచ్చాయని చెప్పారు.