- కొత్త చట్టం ‘క్యూర్’లో అత్యంత ప్రాధాన్యత
- మరిన్ని చట్టబద్ధ అధికారాలు కల్పించనున్న సర్కార్
- నోటీసుల నుంచి కూల్చివేత వరకు హైడ్రాకే అన్ని బాధ్యతలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పడిన హైడ్రా మరింత పవర్ ఫుల్ కాబోతున్నది. ఇప్పటివరకు ఇతర శాఖల సమన్వయంతో పరిమిత అధికారాలతో పనిచేస్తున్న హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధ అధికారాలు కల్పించాలని నిర్ణయించింది. కొత్తగా రాబోతున్న ‘క్యూర్’ చట్టంలో హైడ్రా విభాగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిసింది. హైడ్రాకు పూర్తిస్థాయి స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ కీలక మార్పులు చేయబోతున్నది. ఈ మేరకు రూపొందించిన ముసాయిదాను వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి, చట్టసభల ఆమోదం పొందేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.
నేరుగా నోటీసులు.. తక్షణమే కూల్చివేతలు
ప్రస్తుతం హైడ్రా ఏదైనా ఆక్రమణలను కూల్చివేయాలంటే రెవెన్యూ లేదా మున్సిపల్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవడం కానీ, వారి తరఫున నోటీసులు జారీ చేయడం కానీ అవసరమవుతోంది. కొన్ని సందర్భాల్లో అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల ఆక్రమణదారులకు కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకునే సమయం దొరుకుతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం హైడ్రాకే నేరుగా బాధ్యతలు అప్పగించనుంది. కొత్త చట్టంలో హైడ్రా పరిధిలోని ప్రాంతాలను స్పష్టంగా పేర్కొంటారు. అక్కడ ఆక్రమణలను గుర్తించడం, నేరుగా నోటీసులు జారీ చేయడం, నిర్ణీత గడువు తర్వాత స్వయంగా కూల్చివేతలు చేపట్టే అధికారం హైడ్రాకే ఉండనుంది.
ఫైర్ సేఫ్టీపై కఠిన చర్యలు
అలాగే ఈ చట్టంలో అగ్నిప్రమాదాల నివారణకు సంబంధించి కూడా కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు ఉండనున్నట్లు సమాచారం. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లును ఆమోదింపజేసి, తక్షణమే క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. హైడ్రాకు చట్టబద్ధత లభిస్తే, ఆక్రమణదారులు కోర్టుల ద్వారా తప్పించుకునే మార్గాలు కూడా మూసుకుపోతాయని ప్రభుత్వం ఆశిస్తున్నది. భావితరాలకు పర్యావరణ భద్రత కల్పించే క్రమంలో ఈ నిర్ణయం ఒక మైలురాయిగా నిలవనుంది. జీహెచ్ఎంసీపరిధితో పాటు సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల వ్యాప్తంగా ఇకపై హైడ్రా మరింత పవర్ఫుల్ కానుంది.
ప్రత్యేక పోలీస్ స్టేషన్లు.. సాంకేతిక బృందాలు
హైడ్రాను కేవలం ఒక ఏజెన్సీగా కాకుండా, తిరుగులేని ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా హైడ్రాకు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, చట్టపరమైన విచారణ జరిపే అధికారులు, సాంకేతిక నిపుణులతో కూడిన విభాగాన్ని కేటాయించబోతున్నారు. చెరువులు, నాలాలు, పార్కులు ఎక్కడ ఆక్రమణకు గురైనా ఇతర శాఖల ఉత్తర్వుల కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా, చట్టబద్ధంగా హైడ్రానే నేరుగా చర్యలు తీసుకుంటుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
