మేఘాలయలో బీఫ్ తినడంపై ఆంక్షలు లేవు : బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎర్నెస్ట్ మావ్రీ

మేఘాలయలో బీఫ్ తినడంపై ఆంక్షలు లేవు : బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎర్నెస్ట్ మావ్రీ

మేఘాలయలో గొడ్డు మాంసం తినడంపై ఎలాంటి ఆంక్షలు లేవని, తాను కూడా గొడ్డు మాంసం తింటానని బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎర్నెస్ట్ మావ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గొడ్డు మాంసంపై ఇతర రాష్ట్రాలు ఆమోదించిన తీర్మానంపై తాను ప్రకటన చేయలేనన్న ఆయన.. మేఘాలయలో అందరూ గొడ్డు మాంసం తింటారని, అది ఇక్కడ ప్రజల శైలి అని తెలిపారు. దానిపై ఎటువంటి నిబంధనా లేదని స్పష్టం చేశారు. అవును, తాను కూడా బీఫ్ తింటానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. దీన్ని ఎవరూ ఆపలేరని కూడా అన్నారు. మేఘాలయలో కబేళాలున్నారన్నారు. చాలా మంది ఆవు లేదా పందిని మార్కెట్ కు తీసుకొస్తూ ఉంటారని మావ్రీ తెలిపారు.

అసోం వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు పశువధ, గోమాంసం రవాణా, విక్రయాల నియంత్రణ బిల్లును ఆమోదించిన తరుణంలో ఈశాన్య రాష్ట్రం అసోం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ పలు ఆంక్షలు విధించారు. అయితే బీజేపీ క్రైస్తవ వ్యతిరేక పార్టీ అని కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలను ఎర్నెస్ట్ మావ్రీ ఈ సందర్భంగా కొట్టి పారేశారు. దేశంలో తొమ్మిదేళ్లగా జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) ప్రభుత్వం ఉందని, దేశంలో ఏ చర్చిపై కూడా టార్గెటెడ్ దాడులు జరగలేదని ఆయన చెప్పారు. క్రైస్తవులు అధికంగా ఉండే రాష్ట్రం మేఘాలయ అని, ఇక్కడ అందరూ చర్చికి వెళతారన్నారు. గోవాలోనూ బీజేపీలో అధికారంలో ఉందన్న ఆయన.. అక్కడ కూడా ఒక్క చర్చిని కూడా లక్ష్యంగా చేసుకొని దాడులు చేయలేని మావ్రీ అన్నారు. ఇది కేవలం కాంగ్రెస్, టీఎంసీ, కొన్ని మిత్రపక్ష పార్టీలు చేస్తున్న ప్రచారమేనని ఆరోపించారు. తాను కూడా క్రిస్టియన్‌నేనన్న మావ్రీ.. తనను చర్చికి వెళ్లవద్దని వాళ్లు ఎప్పుడూ చెప్పలేదని తెలిపారు. ఫిబ్రవరి 27న మేఘాలయలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. ఈ సారి మేఘాలయ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఇక్కడ బీజేపీనే అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.