దళితబంధు పేరుతో వసూలు చేసే ఎమ్మెల్యేల లిస్ట్ నా వద్ద ఉంది.. ఇదే లాస్ట్ వార్నింగ్

దళితబంధు పేరుతో వసూలు చేసే ఎమ్మెల్యేల లిస్ట్ నా వద్ద ఉంది.. ఇదే లాస్ట్ వార్నింగ్

బీఆర్ఎస్ ప్లీనరీలో దళితబంధుపై సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలను హెచ్చరించారు. కొందరు ఎమ్మెల్యేలు దళితబంధు పేరుతో రూ.2 నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేశారని, ఆ చిట్టా మొత్తం తన వద్ద ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇదే రిపీట్ అయితే పార్టీ టిక్కెట్ కాదు, పార్టీ నుంచి వెళ్లిపోవడమేనని కీలక వ్యాఖ్యలు చేశారు. అనుచరులు తీసుకున్నా ఆ బాధ్యత ఎమ్మెల్యేలదేనని కేసీఆర్ చెప్పారు. ఎమ్మెల్యేలందరికీ ఇదే తన చివరి వార్నింగ్ అంటూ సీఎం సంచలన కామెంట్స్ చేశారు. 

ప్రజాప్రతినిధులు ఇంట్లో ఉండొద్దని, ప్రజల్లో ఉండాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలల గడువే ఉందన్న ఆయన.. టికెట్ల పంచాయితీపైనా నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. 100సీట్లు లక్ష్యంగా నేతలంతా పని చేయాలని, టికెట్లు ఎవరికి ఇవ్వాలో తనకు తెలుసని చెప్పారు. 

తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరికి హెచ్చరిక

ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరికి సీఎం కేసీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. వ్యక్తిగత ప్రతిష్టకు పోకుండా పార్టీ కోసం పని చేయాలని చెప్పారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. లీడర్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవద్దన్న ఆయన.. అందరూ ఎన్నికలే టార్గెట్ గా పనిచేయాలని సూచించారు. ఎలాంటి సమస్య ఉన్నా హైకమాండ్ దృష్టికి తేవాలన్నారు.