నాపై రామకృష్ణ మఠం ప్రభావం ఎక్కువ : మోడీ

నాపై రామకృష్ణ మఠం  ప్రభావం ఎక్కువ : మోడీ
  • నాపై రామకృష్ణ మఠం   ప్రభావం ఎక్కువ
  • తమిళ భాష, సంస్కృతి అంటే చాలా ఇష్టం: మోడీ
  • చెన్నైలోని రామకృష్ణ మఠం 125వ  వార్షికోత్సవంలో ప్రసంగం  
  • సీఎం స్టాలిన్​తో కలిసి చెన్నై   ఎయిర్​పోర్ట్​లో ఇంటిగ్రేటెడ్​ టర్మినల్​కు మోడీ శ్రీకారం

చెన్నై: ‘‘నాకు తమిళ భాష, తమిళ సంస్కృతి, చెన్నై సిటీ అంటే చాలా ఇష్టం”అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.   తమిళులపై తనకు ప్రత్యేక అభిమానం ఉందని పేర్కొన్నారు. శనివారం  తమిళనాడు రాజధాని చెన్నైలో  పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు.  అనంతరం  చెన్నైలోని రామకృష్ణ మఠంలో నిర్వహించిన 125వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.  పశ్చిమ దేశాల పర్యటన ముగించుకొని భారత్​కు తిరిగొచ్చాక స్వామి వివేకానందుడు  నివసించిన ప్రదేశాన్ని (వివేకానంద హౌస్) చూసే అవకాశం ఈరోజు తనకు దక్కిందన్నారు. ఇటువంటి చోట మెడిటేషన్​ చేయడం గొప్ప అనుభూతిని ఇస్తుందని ప్రధాని చెప్పారు. 

 తనపై రామకృష్ణ మఠం ప్రభావం ఎంతో ఉందన్నారు. ఓ వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పాల్గొన్న అధికారిక కార్యక్రమాలకు సీఎం కేసీఆర్​ గైర్హాజరవగా.. మరోవైపు తమిళనాడులో జరిగిన ప్రధాని ప్రోగ్రామ్స్​లో సీఎం స్టాలిన్​ చురుగ్గా పాల్గొనడం గమనార్హం.  తమిళనాడు పర్యటనలో భాగంగా  చెన్నై ఎయిర్​పోర్ట్​లోని ఇంటిగ్రేటెడ్ ​టర్మినల్​ను, చెన్నై –- కోయంబత్తూర్​ వందేభారత్​ ఎక్స్​ ప్రెస్​ను ప్రధాని  మోడీ ప్రారంభించారు. చెన్నై ఎయిర్​పోర్ట్​లోని ఇంటిగ్రేటెడ్​ టర్మినల్​ను రూ.1260 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. తమిళనాడు సంస్కృతి, సంప్రదాయాలు, కళలను ప్రతిబింబించేలా దీని నిర్మాణం జరిగింది. ఈ టర్మినల్​ అందుబాటులోకి రావడంతో చెన్నై ఎయిర్​పోర్టు ప్యాసింజర్​ సర్వీసింగ్​ వార్షిక కెపాసిటీ 2.3 కోట్ల నుంచి 3 కోట్లకు పెరగనుంది.  

శ్రీలంక నుంచి కచ్చాతీవు దీవిని విడిపించండి: స్టాలిన్​

శ్రీలంక నుంచి కచ్చాతీవు దీవిని విడిపించి, మన దేశంలో కలుపుకోవాలని ప్రధాని మోడీని తమిళనాడు సీఎం స్టాలిన్​ కోరారు. తమిళనాడు జాలర్లు కచ్చాతీవు దీవి వద్ద చేపల వేటకు వెళ్లినప్పుడు ఎదుర్కొంటున్న బాధలు పోవాలంటే..  కచ్చాతీవు దీవిని దేశంలో కలుపుకోవడం ఒక్కటే మార్గమన్నారు. కోఆపరేటివ్​ ఫెడరలిజం స్ఫూర్తిలో భాగంగా తమిళనాడుకు ప్రాజెక్టులు, నిధుల కేటాయింపును పెంచాలన్నారు. 

నీట్​ మెడికల్​ ఎంట్రెన్స్​ ఎగ్జామ్​ నుంచి తమిళనాడు విద్యార్థులకు మినహాయింపు ఇవ్వాలని ఆయన డిమాండ్​ చేశారు. 2022 మే 15 నాటికి తమిళనాడుకు కేంద్రం ఇవ్వాల్సిన జీఎస్టీ పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలన్నారు. జీఎస్టీ పరిహారం చెల్లించే గడువును 2022 జూన్​ నుంచి మరో రెండేళ్లు పొడిగించాలని  ప్రధానిని కోరారు.