బాధ్యతాయుతంగా ఆడాలి.. వైస్‌‌ కెప్టెన్‌‌గా నాపై అంచనాలుంటాయి :తిలక్‌‌ వర్మ

బాధ్యతాయుతంగా ఆడాలి.. వైస్‌‌ కెప్టెన్‌‌గా నాపై అంచనాలుంటాయి :తిలక్‌‌ వర్మ
  • తొలి బాల్‌‌ కే  భారీ షాట్‌‌ కొట్టొద్దు
  • జింబాబ్వేపై గెలిచేందుకు ప్రయత్నిస్తాం

హరారే: 
ఇంగ్లండ్‌‌, ఐర్లాండ్‌‌ పర్యటనల్లో ప్రారంభంలోనే వికెట్లు పడిపోయినంత మాత్రానా.. తనలాంటి మిడిలార్డర్‌‌ బ్యాటర్‌‌ ఇన్నింగ్స్‌‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడటానికి వీలుండదని టీమిండియా టీ20 వైస్‌‌ కెప్టెన్‌‌ తిలక్‌‌ వర్మ అన్నాడు. తన ఆట తీరు పిచ్‌‌, మ్యాచ్‌‌ సందర్భంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశాడు. ‘టీ20ల్లో మనం వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్‌‌ చేయాల్సి ఉంటుంది. క్లిష్ట పరిస్థితుల్లో అది అంత సులభం కాదు. అదే టైమ్‌‌లో జట్టుకు ఏది అవసరమో అదే చేస్తాను. జట్టు అవసరాల కోసం నిదానంగా ఆడాల్సి వస్తే అలాగే ఆడతా. ఒకవేళ దూకుడుగా ఆడాల్సి వస్తే భారీ షాట్లు కొడతా.

ఐర్లాండ్‌‌, ఇంగ్లండ్‌‌లో పవర్‌‌ప్లేలోనే నాలుగైదు వికెట్లు పడ్డాయి. కాబట్టి క్రీజులోకి వెళ్లగానే భారీ షాట్లు ఆడటానికి ప్రయత్నించి ఔట్‌‌ కావడంలో పెద్దగా అర్థం ఉండదు’ అని గురువారం జింబాబ్వేతో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌‌ నేపథ్యంలో తిలక్ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు. 

విచక్షణ అవసరం..

ఇన్నింగ్స్‌‌ ఆరంభం నుంచి దూకుడుగా ఆడాలని అనుకున్నప్పటికీ కొన్నిసార్లు విచక్షణతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని తిలక్‌‌ వెల్లడించాడు. ‘తొలి బంతికే భారీ షాట్ ఆడగలననే ఆలోచన ఎప్పుడూ నా మనసులో ఉంటుంది. కానీ అదే సమయంలో, నేను దేశం కోసం ఆడుతున్నాను, కాబట్టి నాపై చాలా బాధ్యతలు ఉంటాయి. నా పేరుకు ముందు వైస్ కెప్టెన్ హోదా ఉంటుంది. జట్టు మేనేజ్‌‌మెంట్‌‌ ఎంతో ఆలోచించి ఆ బాధ్యతను నాకు అప్పగించింది.

కాబట్టి మేనేజ్‌‌మెంట్‌‌ నాకు అప్పగించిన బాధ్యతలను స్వీకరించి, దానికి అనుగుణంగానే ఆడుతున్నా’ అని తిలక్ వివరించాడు. గత రెండేళ్లుగా ఆసియాలోనే ఎక్కువగా క్రికెట్‌‌ ఆడటం వల్ల ఇంగ్లండ్‌‌ పరిస్థితులకు జట్టు త్వరగా అలవాటు పడకపోవడమే ఓటమికి కారణమన్నాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే శ్రేయస్ భాయ్ ప్రస్తుతం ఒక విజయవంతమైన జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. దాంతో సహజంగానే బాధ్యతలు, అంచనాలు ఎక్కువగా ఉంటాయి.

అదే సమయంలో ఐర్లాండ్‌‌లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గత రెండేళ్లలో మనం ఆసియాలోనే ఎక్కువ మ్యాచ్‌‌లు ఆడాం. రెండేళ్ల తర్వాత నేరుగా విదేశీ పరిస్థితుల్లో, అదీ బలమైన జట్టుతో ఆడాల్సి వచ్చింది. ఇంగ్లండ్ చాలా బలమైన జట్టు. టీ20 వరల్డ్‌‌ కప్‌‌ సెమీఫైనల్స్‌‌లో వాళ్లు ఎలా ఆడారో మనం చూశాం. అంతటి బలమైన జట్టుతో, భిన్నమైన పరిస్థితుల్లో ఆడటం ఖచ్చితంగా సవాలుతో కూడుకున్నదే’ అని ఈ హైదరాబాదీ వ్యాఖ్యానించాడు. 


జింబాబ్వేపై గెలుస్తాం

ఐర్లాండ్, ఇంగ్లండ్ ఓటములను పక్కనబెట్టి జింబాబ్వేపై తమ జట్టు గట్టిగా పోరాడుతుందని తిలక్‌‌ హామీ ఇచ్చాడు. ‘గతంలో కాకుండా ఈసారి మేం పూర్తి బలగంతో బరిలోకి దిగుతాం. జింబాబ్వే కూడా మంచి జట్టు. చాలా గట్టి పోటీ ఉంటుంది. గతేడాది సిరీస్‌‌ ప్రారంభించినప్పుడే వాళ్లు తొలి మ్యాచ్‌‌ గెలిచారు.

కాబట్టి మాపై గట్టిగానే పోరాడతారని భావిస్తున్నాం. గతేడాది జూనియర్‌‌ జట్టు ఇక్కడ ఆడింది. అప్పట్లో పిచ్‌‌లు బాగున్నాయి. అప్పుడు ఆడిన చాలామంది ప్లేయ ర్లు ఇప్పుడు జట్టులో ఉన్నారు. పిచ్​  ఎలాస్పంది స్తుంద నే దాని గురించి నేను వైభవ్‌‌తో మాట్లాడుతున్నా. ఐర్లాండ్, ఇంగ్లండ్‌‌తో సిరీస్‌‌లు పెద్ద గ్రౌండ్స్‌‌లో జరిగాయి. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. చల్లని గాలి, వాతావరణా నికి తగ్గట్లుగా వ్యూహాలు రచించాలి’ అని తిలక్‌‌ వివరించాడు.