పోలీసులను నమ్మిన.. కానీ నన్నే బద్నం చేసిర్రు: కరూర్‌ తొక్కిసలాటపై సీఎం విజయ్

పోలీసులను నమ్మిన.. కానీ నన్నే బద్నం చేసిర్రు: కరూర్‌ తొక్కిసలాటపై సీఎం విజయ్

చెన్నై: కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే చీఫ్, సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది కరూర్‎లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు పోలీసులు భద్రత కల్పిస్తారని తాను నమ్మానని.. కానీ అప్పటి డీఎంకే ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదన్నారు. పోలీసులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుని తొక్కిసలాట నిందను నాపై వేశారని హాట్ కామెంట్ చేశారు.

2025, సెప్టెంబర్ 27న విజయ్ కరూర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి టీవీకే కార్యకర్తలు, విజయ్ అభిమానులు అంచనాలకు మించి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 41 మంది మరణించారు. ఈ నేపథ్యంలో 2026, జూలై 10న సీఎం హోదాలో విజయ్ తొలిసారి కరూర్ జిల్లాలో పర్యటించి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరూర్ సభకు వచ్చే జనసందోహాన్ని, ట్రాఫిక్‌ను పోలీసులు కంట్రోల్ చేస్తారని తాను నమ్మానని.. కానీ అప్పటి డీఎంకే ప్రభుత్వ ఒత్తిడి వల్ల పోలీసులు తన సభకు సరైన ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు. దీంతో తొక్కిసలాట జరిగి 41 మంది అమాయకులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుని తొక్కిసలాట నిందను నాపై నెట్టేసే ప్రయత్నం చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. 

►ALSO READ | SIR ఫామ్ నింపేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారా..? అలా చేస్తే ఆధార్, మీసేవ సెంటర్లు మూత పడ్డట్లే

కరూర్ తొక్కిసలాట ఘటన నా జీవితంలోనే అత్యంత విచారకరమైన క్షణమని ఆవేదన వ్యక్తం చేశారు. కరూర్ తొక్కిసలాటలో మన సోదరీమణుల పిల్లలను కోల్పోయామని బాధపడ్డారు. కరూర్ తొక్కిసలాట వెనక అప్పటి డీఎంకే ప్రభుత్వ కుట్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల ముందు ఈ ఘటనను రాజకీయ చేసి.. బాధితుల మరణాల నుంచి రాజకీయ లబ్ధి పొందాలని చూశారని డీఎంకే, అన్నాడీఎంకేపై విమర్శలు గుప్పించారు. 

తొక్కిసలాటలో మరణించిన వారికి శాశ్వత నివాళిగా కరూర్‌లో టీవీకే పార్టీ ఆధ్వర్యంలో స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ స్మారక చిహ్నం భవిష్యత్ తరాలకు ఆ విషాదాన్ని గుర్తుచేస్తుందని.. ఇలాంటి ఘటనలు మళ్లీ మర్చిపోకుండా ఉండేందుకు సహాయపడుతుందని అన్నారు.