ఆ డబుల్‌‌ సెంచరీని ఎప్పటికీ గుర్తుంచుకుంటా: గిల్‌‌

ఆ డబుల్‌‌ సెంచరీని ఎప్పటికీ గుర్తుంచుకుంటా: గిల్‌‌
  • ఇండియా టెస్టు కెప్టెన్‌‌కు ఐసీసీ ప్లేయర్‌‌‌‌ ఆఫ్ ద మంత్‌‌ అవార్డు

దుబాయ్: ఇంగ్లండ్ తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో 754 రన్స్‌‌తో దుమ్మురేపిన ఇండియా కెప్టెన్ శుభ్‌‌మన్ గిల్‌‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) జులై నెలకు గాను ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డు కోసం గిల్ తో పాటు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్,  సౌతాఫ్రికా ఫ్రికా ఆల్ రౌండర్ వియాన్ ముల్డర్ కూడా పోటీపడ్డారు. ఇంగ్లండ్‌ టూర్‌‌‌‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేని జట్టును కెప్టెన్‌‌గా గిల్‌‌ ముందుండి నడిపించి, నాలుగు సెంచరీలు కూడా సాధించాడు. 

ఫలితంగా ఇండియా-  ఈ సిరీస్‌‌ను  2–-2తో పంచుకుంది.  ఐసీసీ అవార్డును గెలుచుకున్న తర్వాత గిల్ మాట్లాడుతూ బర్మింగ్‌‌హామ్ లో తాను సాధించిన డబుల్ సెంచరీ ఇంగ్లండ్‌‌ టూర్‌‌‌‌లో తనకెంతో ప్రత్యేకమని చెప్పాడు.  ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు  గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. కెప్టెన్ గా నా తొలి టెస్టు సిరీస్ లో ఈ గుర్తింపు రావడం మరింత ఆనందంగా ఉంది. బర్మింగ్‌‌హామ్ లో చేసిన డబుల్ సెంచరీని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. 

ఇది ఇంగ్లండ్‌‌ టూర్‌‌‌‌లో నా ఆటలో హైలైట్‌‌’  అని చెప్పాడు. కాగా, 25 ఏండ్ల గిల్ ఈ అవార్డును గెలుచుకోవడం ఇది నాలుగోసారి.  జులై లో అతను మూడు టెస్టుల్లో 94.50 సగటుతో 567 రన్స్‌‌ సాధించాడు. కాగా, విమెన్స్ కేటగిరీలో ఇంగ్లండ్ బ్యాటర్ సోఫియా డంక్లీ ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్‘ అవార్డును గెలుచుకుంది.