ఆత్మగౌరవం కోసం మునుగోడు ప్రచారానికి వెళ్లను

ఆత్మగౌరవం కోసం మునుగోడు ప్రచారానికి వెళ్లను

రేవంత్ రెడ్డి వర్గం తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తోందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. తనతోపాటు ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలను అగౌరవపరచడం ఆ వర్గానికి అలవాటుగా మారిందన్నారు. అనుభవం లేని వారికి బాధ్యతలు ఇవ్వడం వల్లే పార్టీ వీక్ అయిందని..రేవంత్ రెడ్డి తో వేదిక పంచుకోలేనంటూ తేల్చిచెప్పారు. 30ఏళ్ల నుంచి పార్టీకి నిజాయితీగా సేవలందిస్తున్న నేతలను హోంగార్డులుగా పోల్చుతున్నారని.. ఆత్మగౌరవం కాపాడుకోవడానికే మునుగోడు ఎన్నికల ప్రచారానికి వెళ్లడం లేదని తెలిపారు.

మాణిక్యం ఠాగూర్ వైఖరి వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం కోల్పోతుందని కోమటిరెడ్డి ఆరోపించారు. తక్షణమే మాణిక్యం ఠాగూర్ ను తప్పించి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గా కమల్నాథ్ వంటి నేతలను నియమించాలన్నారు. 35 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేసిన తనకు మాణిక్కం ఠాగూర్ వల్ల అన్యాయం జరిగిందన్నారు. పది పార్టీలు ఫిరాయించిన నేతలను పార్టీలో చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్ కు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 30 నుంచి 35 వేల ఓట్లు రావడమే కష్టమన్న ఆయన మునుగోడు ఎన్నికల ప్రచారానికి వెళ్లనని చెప్పారు. 

సోనియాగాంధీకి లేఖ రాసిన కోమటిరెడ్డి ప్రియాంక గాంధీతో సమావేశానికి హాజరుకాకపోవడంపై లేఖలో వివరించారు. రేవంత్ తన అనుచరులతో అవమానకరంగా మాట్లాడించడంతో పాటు.. ఎలాంటి సమాచారం లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. చండూరులో మీటింగ్, చెరుకు సుధాకర్ జాయినింగ్స్ అంశాలను లేఖలో ప్రస్తావించారు. గత మూడు దశాబ్దాల నుంచి పార్టీ కోసం విధేయత, చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని.. తనను లక్ష్యంగా చేసుకోవడం హృదయవిదారకంగా అనిపిస్తోందన్నారు. అయితే రానున్న ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.