వైరల్ వీడియో: రిపోర్టర్‌ను ఉరికించి కొట్టిన ఐఏఎస్

వైరల్ వీడియో: రిపోర్టర్‌ను ఉరికించి కొట్టిన ఐఏఎస్

మంచైనా.. చెడైనా సరే ఏ వార్తయినా కవర్ చేయడంలో విలేఖరులు కీలకపాత్ర పోషిస్తారు. దేశ, విదేశాలతో పాటు మారుమూల ప్రాంతాలలో  జరిగిన సంఘటనలను కూడా అందరి దృష్టికి తీసుకువెళ్తారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంటే.. ప్రాణాలకు తెగించి కరోనా వార్తలు, లాక్‌డౌన్ వార్తలు ప్రజలకు చేరవేశారు. అటువంటి క్లిష్టమైన బాధ్యతలను నిర్వర్తిస్తోన్న విలేకరిని ఓ ఐఏఎస్ ఉరికించి కొట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.

యూపీలో శనివారం పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఉన్నావోలో ఎన్నికల తీరును విలేకర్లు కవర్ చేస్తున్నారు. అదే సమయంలో అక్కడికి చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ దివ్యాన్షు పటేల్ వచ్చారు. స్థానిక కౌన్సిల్ సభ్యలను ఓటు వేయకుండా అడ్డుకున్నారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం గురించి సదరు ఐఏఎస్ అధికారిని ఓ విలేకరి ప్రశ్నించాడు. దాంతో ఆగ్రహానికి గురైన దివ్యాన్షు పటేల్ రిపోర్టర్‌పై దాడిచేశాడు. అందరూ చూస్తుండగానే ఉరికించి కొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రిపోర్టర్‌ మీద జరిగిన దాడిని జర్నలిస్టు సంఘాలు విస్తృతంగా ఖండించాయి. 

రిపోర్టర్‌పై ఒక ఐఏఎస్ అధికారి దాడిచేయడం గురించి స్థానికి విలేకరులందరూ ఉన్నావో జిల్లా మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లారు. ‘మేం జర్నలిస్టులందరితో మాట్లాడం. దాడికి గురైన జర్నలిస్ట్ నుంచి మాకు లిఖితపూర్వక ఫిర్యాదు వచ్చింది. ఈ కేసులో ఐఏఎస్ అధికారిపై న్యాయమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నాను’ అని మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ తెలిపారు.

కాగా.. బ్లాక్ పంచాయతీ ఎన్నికలలో బీజేపీ తన మద్దతుదారులతో కలిసి 635కి పైగా సీట్లను గెలుచుకుంటుందని సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా దాదాపు 17 జిల్లాల్లో ఘర్షణలు, హింసలు చెలరేగాయని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. గెలుపుకోసం బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడిందని సమాజ్‌వాదీ పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.