- మూవీరూల్జ్, తమిళ్ ఎంవీ నిర్వాహకులకు క్రిప్టోలో పేమెంట్
- ఐబొమ్మ మాటున బెట్టింగ్ యాప్స్, వ్యూయర్స్ లెక్కతో డాలర్లు
- కస్టడీ విచారణలో వివరాలు రాబట్టిన పోలీసులు
- మూవీరూల్జ్, తమిళ్ ఎంవీ నిర్వాహకులనూ పట్టుకుంటం: అడిషనల్ సీపీ శ్రీనివాస్
హైదరాబాద్, వెలుగు: ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవి కేసులో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. అతడు సినిమాలను పైరసీ చేయలేదని.. టెలిగ్రామ్ తోపాటు మూవీరూల్జ్, తమిళ్ ఎంవీ వంటి పైరసీ సైట్ ల నుంచి కొని ఐబొమ్మ, బప్పం సైట్ లలో అప్ లోడ్ చేశాడని వెల్లడైంది. ఐబొమ్మ మాటున బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన రవి.. ఈజీగా సంపాదించిన కోట్ల డబ్బుతో విదేశాల్లో జల్సాలు చేశాడని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.
విమానాల్లో చక్కర్లు కొడుతూ, వారానికో దేశం తిరిగినట్లు విచారణలో బయటపడింది. ఎలాంటి రిలేషన్స్.. ఎమోషన్స్ లేకుండా తనకు తానే అన్నట్టు ఉంటూ జల్సాలే జీవితంగా గడిపినట్టు అతడు ఇన్వెస్టిగేషన్లో పోలీసులకు వెల్లడించాడు. ఈ మేరకు ఐదు రోజులు కస్టడీ విచారణకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ అడిషనల్ సీపీ(క్రైమ్స్) శ్రీనివాస్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఐబొమ్మలో పైరసీ సినిమాల ప్రాసెస్‌ను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ‘‘బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన రవి.. వెబ్‌సైట్లను డెవలప్ చేయడంలో నైపుణ్యం సాధించాడు. తన వివరాలు, ఈ–మెయిల్ ఐడీతో ఎన్‌జిలా కంపెనీ ద్వారా డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు.
ఐపీ వాల్యూమ్ హోస్టింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత సీఎంఎస్ (కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టం) ద్వారా టెలిగ్రామ్, మువీరూల్జ్, తమిళ్ ఎంవీ వంటి పైరసీ సైట్ల నుంచి పైరసీ సినిమాలు కొనుగోలు చేసేవాడు. డబ్బును క్రిప్టో రూపంలో ట్రాన్స్ఫర్ చేసేవాడు. ఇలా కొనుగోలు చేసిన పైరసీ సినిమాను తన వద్ద ఉన్న అత్యాధునిక టెక్నాలజీతో హెచ్‌డీ క్వాలిటీ వచ్చేలా ఎన్‌హ్యాన్స్ చేసి ఐబొమ్మ, బప్పమ్ సైట్లలో అప్‌లోడ్ చేసేవాడు” అని ఏసీపీ వివరించారు.
వెబ్3 టెక్నాలజీ వస్తే కష్టమే..
ఐబొమ్మను అడ్డం పెట్టుకొని లక్షలాది మంది డేటాను తన వద్ద స్టోర్ చేసుకోవడంతో పాటు.. బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన రవి రూ. కోట్లు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. సినిమాలను పైరసీ చేసి టెలిగ్రామ్, మూవీరూల్జ్, తమిళ్ ఎంవీ వెబ్‌సైట్లలో పెడుతున్న నిర్వాహకులను కూడా త్వరలో పట్టుకుంటామని అడిషనల్ సీపీ శ్రీనివాస్ తెలిపారు. ఇది ఒక్క ఐబొమ్మ, బప్పంతో ఆగేది కాదని, ఐబొమ్మ పేరుకు ఇతర అక్షరాలు యాడ్ చేసి వందల సంఖ్యలో ఐబొమ్మలు ఓపెన్ అయ్యేలా డొమైన్‌లు సృష్టించారని వెల్లడించారు. అయితే, త్వరలోనే వెబ్-3 టెక్నాలజీ రాబోతుందని, ఆ టెక్నాలజీతో పైరసీ చేస్తే నిందితులను పట్టుకోవడం కష్టమని ఏసీపీ పేర్కొన్నారు.
వ్యూయర్స్ లెక్కన పేమెంట్
సినిమాలను రవి ఎక్కడా డైరెక్ట్‌గా పైరసీ చేయలేదని, కానీ.. టెలిగ్రామ్‌తోపాటు, మువీరూల్జ్, తమిళ్ ఎంవీ వంటి పైరసీ సైట్ల నుంచి కొనుగోలు చేశాడని పోలీసులు తెలిపారు. ‘‘ఐబొమ్మ సైట్ లోకి సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలనుకునే వారితో పాటు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారంతా తప్పని సరిగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ను యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. రెండో స్టేజీలోనూ కండిషన్స్ యాక్సెప్ట్ చేసిన వెంటనే ముందుగా బెట్టింగ్, గేమింగ్ యాప్స్ లింకులు ఓపెన్ అయ్యేవి.
ఆ యాడ్స్ అయిపోయేంత వరకు వేచిచూడాల్సిందే. ఇలాంటి వ్యూయర్‌షిప్ ద్వారా ఆయా బెట్టింగ్ యాప్స్ కంపెనీలు రవికి డబ్బులు చెల్లించాయి. యాడ్స్ క్యాష్, యాడ్స్ సేవా కంపెనీల ద్వారా రవి క్రియేట్ చేసుకున్న యాడ్ బుల్ కంపెనీ ఖాతాలోకి డబ్బులు జమ అయ్యాయి. ఆ డబ్బులను యూఎస్ డాలర్లు, క్రిప్టో కరెన్సీ రూపంలో ఇండియన్ కరెన్సీగా మార్చుకున్నాడు’’ అని వివరించారు.
