ఇబ్రహీంపట్నం కు.ని ఘటన బాధ్యులను గుర్తించని సర్కార్‌‌‌‌

ఇబ్రహీంపట్నం కు.ని ఘటన బాధ్యులను గుర్తించని సర్కార్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ కేసు అటకెక్కుతోంది. ఈ నెల 25న ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌‌‌‌లో కు.ని. ఆపరేషన్‌‌ ఫెయిలై నలుగురు మహిళలు మరణించి, 20 రోజులు అవుతున్నా.. ఇప్పటివరకు బాధ్యులను రాష్ట్ర సర్కార్‌‌‌‌ గుర్తించలేకపోయింది. ఈ ఘటనకు కారకులైన వారిని వదిలేది లేదన్న రాష్ట్ర సర్కార్.. ఇప్పుడు సడీసప్పుడు చేస్తలేదు. దీనిపై విచారణ జరిపిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కమిటీ 10 రోజుల కింద ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అందులో ఏముందో ప్రభుత్వం బయట పెట్టలేదు. ఘటన జరిగిన తర్వాత సర్జన్, సూపరింటెండెంట్‌‌పై తాత్కాలిక చర్యలు తీసుకున్నారే తప్ప.., ఆపరేషన్లలో పాల్గొన్న డాక్టర్లు, సిబ్బంది, క్యాంపు పర్యవేక్షణలో ఉన్న ఆఫీసర్లకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన వెంటనే మీడియాకు కూడా విడుదల చేస్తామని చెప్పిన హెల్త్ డైరెక్టర్‌‌‌‌.. ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. విచారణలో ఏం తేల్చారో చెప్పాలని డీహెచ్‌‌ను మీడియా అడగగా, ఆయన సమాధానమివ్వకుండా దాటవేస్తున్నారు. కమిటీలో మిగతా సభ్యులు కూడా ఇదే వైఖరి అవలంబిస్తున్నారు. ఘటనపై విచారణ జరిపిన మహిళా కమిషన్‌‌ కారకులపై క్రిమినల్ కేసులు పెట్టాలని జిల్లా కలెక్టర్‌‌‌‌ను ఆదేశించినా, ఇప్పటివరకు కేసులు నమోదు కాలేదు. 

రివర్స్ కొట్టే ప్రమాదం!

ఇబ్రహీంపట్నం ఘటనలో డాక్టర్లు, స్టాఫ్‌‌ వైపు ఎంత తప్పు ఉందో, సర్కార్‌‌‌‌ది కూడా అంతకుమించి తప్పు ఉందని వైద్య సంఘాలు ఆరోపిస్తున్నాయి. డబుల్ పంక్చర్ ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడానికి డాక్టర్లను నియమించకపోవడం, నలుగురే డాక్టర్లతో వేల మందికి సర్జరీలు చేయించడం, టార్గెట్ల విధింపు, ఇబ్రహీంపట్నం హాస్పిటల్‌‌కు పూర్తిస్థాయిలో సూపరింటెండెంట్ లేకపోవడం వంటి అంశాలన్నీ వైద్య సంఘాల ప్రతినిధులు లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరిపైన చర్యలు తీసుకున్నా, తిరిగి సర్కార్‌‌‌‌కే బెడిసి కొడుతుందన్న భయం వైద్య శాఖ పెద్దల్లో కనిపిస్తోంది. దీంతో కమిటీ రిపోర్ట్ ఇచ్చినా సర్కార్ గప్‌‌చుప్‌‌గా ఉంటోందని ఆరోగ్య శాఖ సర్కిళ్లలో చర్చ జరుగుతోంది. ఒకవేళ జాతీయ కమిషన్, సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ నుంచి ఒత్తిడి చేస్తే తక్కువ మందినే బాధ్యులుగా చూపించాలనే అంశంపై సెక్రటేరియట్‌‌లోని హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. కాగా, ఇబ్రహీంపట్నం లాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కొత్త నిబంధనలు రూపొందిస్తామన్న సర్కార్‌‌‌‌.. ఇప్పటివరకు దాని ఊసే ఎత్తడం లేదు. దీంతో సర్జరీల ప్రారంభంపై స్పష్టత 
లేకుండా పోయింది.