హైదరాబాద్‌కు అన్యాయం.. తెలుగు గడ్డపై బీసీసీఐకి ఈ వివక్ష ఎందుకు?

హైదరాబాద్‌కు అన్యాయం.. తెలుగు గడ్డపై బీసీసీఐకి ఈ వివక్ష ఎందుకు?

కొద్దిసేపటి క్రితమే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ).. వన్డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ విడుదలైన నిమిషాల్లోనే హైదరాబాద్‌కు అన్యాయం జరిగిందన్న మాట తెరమీదకు వస్తోంది. తెలుగు గడ్డపై బీసీసీఐ వివక్ష చూపుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు ఉప్పల్ వేదికగా టీమిండియా మ్యాచులు లేకపోవడం ఒక కారణమైతే.. జరిగే మూడు మ్యాచులు క్వాలిఫయర్ జట్లతో షెడ్యూల్ చేయడం మరో కారణం. 

వరల్డ్ కప్ 2023 టోర్నీకి 8 జట్లు నేరుగా అర్హత సాధించగా, మరో రెండు జట్లు జింబాబ్వే వేదికగా జరుగుతున్న క్వాలిఫయర్ మ్యాచుల ద్వారా అర్హత సాధించనున్నాయి. ఆ రెండు జట్ల మ్యాచులే ఉప్పల్ వేదికగా జరగనున్నాయి. రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా అక్టోబర్ 6న పాకిస్తాన్ - క్వాలిఫైయర్ 1జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా.. అక్టోబర్ 9న న్యూజిల్యాండ్- క్వాలిఫైయర్-1 జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అనంతరం అక్టోబర్ 12న పాకిస్తాన్ - క్వాలిఫైయర్-2 జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. 

పేరుకే హైదరాబాద్ వేదిక

జరిగేదే మూడు మ్యాచులు అంటే.. వాటిని టోర్నీ ప్రారంభమైన వారం రోజుల్లోనే ముగిసేలా షెడ్యూల్ చేశారు. పోనీ వీటిలో ఏమైనా చూడగలిగే మ్యాచ్ ఉందా? అంటే.. అదీ కనిపించడం లేదు. ఒకవేళ జింబాబ్వే కనుక క్వాలిఫైయర్-1 లేదా క్వాలిఫైయర్-2గా వస్తే.. పాకిస్తాన్‌తో వారి మ్యాచ్ చూడొచ్చు. అనంతరం పసికూన జట్టుతో తలపడనున్న కివీస్ మ్యాచ్‌పై ఎవరూ ఆసక్తి చూపకపోవచ్చు. ఇలాంటి మ్యాచులు హైదరాబాద్‌లో నిర్వహించడం పట్ల తెలుగు అభిమానులు.. బీసీసీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ:ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని కఠినంగా శిక్షించాలె.. డీజీపీకి ఫిర్యాదు

ఉప్పల్ వేదికగా జరిగే 3 మ్యాచులు 

  • అక్టోబర్ 6: పాకిస్తాన్ vs క్వాలిఫయర్ -1 
  • అక్టోబర్ 9: న్యూజిలాండ్ vs క్వాలిఫయర్ -1
  • అక్టోబర్ 12: పాకిస్తాన్ vs క్వాలిఫయర్ -2

HCAలో అవినీతి

హైదరాబాద్‌లో కీలక మ్యాచులు లేకపోవడానికి హెచ్‌సీఏ తీరు కూడా ఒక కారణమన్నది క్రికెట్ విశ్లేషకుల మాట. హెచ్‌సీఏలో అవినీతి పేరుకుపోయిందని.. ఆధిపత్య పోరు కోసం బోర్డు సభ్యులు రెండు వర్గాలుగా విడిపియి పట్టించుకోవడం లేదనే మాటలు వినపడుతున్నాయి. ఐపీఎల్ మ్యాచుల సమయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలు, టికెట్ల కుంభకోణం వంటి విషయాలను అందుకు కారణాలుగా ప్రస్తావిస్తున్నారు.