న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్‌లో బంతి మెరుపు కోసం ఆటగాళ్లు దానిపై సలైవా (ఉమ్మి) పూస్తుంటారు. అలాగే, బాల్‌ను తమ జెర్సీలకు రుద్దుతూ షైనింగ్ తెస్తుంటారు. వీటికి అనుమతి ఉంది కానీ.. మరేరకంగా అయినా పాలిష్ చేయడాన్ని బాల్ ట్యాంపరింగ్‌గా పరిగణిస్తారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తికి ఉమ్మి కూడా కారణం కావడంతో బంతిపై సలైవా పూసేందుకు బౌలర్లు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్ మళ్లీ మొదలయ్యాక.. బాల్ ట్యాంపరింగ్‌ను చట్ట బద్ధం చేయాలని ఐసీసీ యోచిస్తున్నట్టు సమాచారం. సలైవాపై నిషేధం పడే ఆస్కారం ఉండడంతో అనుమతించిన కృత్రిమ పదార్థాల ద్వారా బాల్‌ను పాలిష్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్న విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందుకోసం ఐసీసీ రూల్స్‌ను మార్చాల్సి ఉంటుంది. బంతిపై సలైవా రుద్దడం సురక్షితం కాదని ఐసీసీ మెడికల్ కమిటీ వ్యక్తం చేసిన అనుమానాలను క్రికెట్ తిరిగి మొదలయ్యే ముందే నివృత్తి చేసే అవకాశం ఉంది. బాల్‌ను షైనింగ్ చేయడం టెస్టు క్రికెట్‌లో ఒక భాగం. అలా చేసిన బాల్‌తో బౌలర్లు ఈజీగా స్వింగ్, రివర్స్ స్వింగ్ రాబడతారు. కానీ, ఈ సౌలభ్యం లేకపోతే టెస్టు క్రికెట్‌లో బౌలర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్‌వుడ్ అన్నాడు. అప్పుడు బ్యాట్స్‌మెన్‌దే పూర్తి ఆధిపత్యం అవుతుందని చెప్పాడు. ఇండియా మాజీ పేసర్ వెంకటేశ్‌ప్రసాద్ మాత్రం బాల్‌పై సలైవా వాడకూడదన్న ఐడియాకు మద్దతు తెలిపాడు. కావాలంటే కొంతకాలం వరకు చెమటను రుద్దేందుకు అనుమతించాలన్నాడు. అయితే, ఇప్పటిదాకా ఉన్న అలవాటును ఒక్కసారిగా మానడం బౌలర్లకు కష్టమవుతుందని అభిప్రాయపడ్డాడు.

