ఈ ఏడాది మీరు విదేశీ పర్యటన/ ఫారెన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే, టికెట్లు బుక్ చేసుకునే ముందు ఈ దేశాల కొత్త వీసా రూల్స్ ఒకసారి చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే, గతంలో భారతీయులు ఈజీగా వెళ్లొచ్చే కొన్ని దేశాలు ఇప్పుడు రూల్స్ మార్చేశాయి.
బొలీవియా, కేప్ వెర్డే, నికరాగ్వా, ఇరాన్ దేశాలు 2026లో వీసా పద్ధతులను సవరించాయి. కొన్ని దేశాలు వీసా-ఫ్రీ ట్రావెల్ రద్దు చేయగా, మరికొన్ని 'వీసా ఆన్ అరైవల్' ఫెసిలిటీ తీసేసాయి. అంటే ఇకపై వెళ్లే ముందే వీసా తీసుకోవడం తప్పనిసరి.
2026లో వీసా రూల్స్ మార్చిన 4 దేశాలు:
1. బొలీవియా: వీసా ఆన్ అరైవల్ రద్దు
ఇకపై బొలీవియా విమానాశ్రయానికి వెళ్లిన తర్వాత వీసా తీసుకునే అవకాశం లేదు. దీనికి బదులు ఇ-వీసా (E-Visa) విధానాన్ని తెచ్చింది. ఎవరైనా ప్రయాణికులు బొలీవియా వెళ్లే ముందే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, అప్రూవల్ వచ్చిన తర్వాతే వెళ్లాలి.
2. కేప్ వెర్డే: వీసా-ఆన్-అరైవల్ బంద్
అందమైన సముద్ర తీరాలకు పేరుపొందిన కేప్ వెర్డే.. భారత్‌తో సహా 96 దేశాలకు ఇస్తున్న వీసా-ఆన్-అరైవల్ సౌకర్యాన్ని జనవరి 1, 2026 నుండి నిలిపివేసింది. గతంలో అక్కడికి వెళ్లిన తర్వాత ఫీజు చెల్లించి వీసా తీసుకునేవారు, కానీ ఇప్పుడు ముందుగానే వీసా తీసుకుని వెళ్లాలి లేదంటే విమానాశ్రయంలో ఎంట్రీ నిరాకరిస్తారు.
3. నికరాగ్వా: ముందస్తు అనుమతి తప్పనిసరి
భారతీయుల కోసం నికరాగ్వా పెద్ద మార్పు చేసింది. ఫిబ్రవరి 16 నుండి వీసా ఆన్ అరైవల్ రద్దు చేసింది. దీనిని 'కన్సల్టెడ్ వీసా' కేటగిరీ కింద మార్చారు. విమానం ఎక్కే ముందే నికరాగ్వా ఇమ్మిగ్రేషన్ అధికారుల నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఈ అనుమతి లేకపోతే ఎయిర్‌లైన్స్ వారు మిమ్మల్ని ఫ్లైట్ ఎక్కనివ్వరు.
4. ఇరాన్: వీసా ఫ్రీ ఎంట్రీ రద్దు
గతంలో భారతీయులు ఇరాన్‌కు వెళ్లడానికి వీసా అవసరం ఉండేది కాదు. కానీ, ఇరాన్ ప్రభుత్వం వీసా మినహాయింపును నిలిపివేసింది. దింతో ఇప్పుడు భారతీయులు ఇరాన్ వెళ్లాలన్నా కచ్చితంగా ముందుగానే వీసా పొందాలి.
విదేశాలకు వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
అధికారిక వెబ్‌సైట్లలో చెక్ చేయండి: మీరు వెళ్లే దేశం అఫీషియల్ ఎంబసీ లేదా ఇమ్మిగ్రేషన్ వెబ్‌సైట్‌లో కొత్త వీసా రూల్స్‌ను పరిశీలించండి. ఇ-వీసా లేదా ముందస్తు అనుమతి కావాలంటే చివరి నిమిషం వరకు ఆగకుండా చాలా ముందే దరఖాస్తు చేసుకోండి. వీసా డాక్యుమెంట్లకు సంబంధించి డిజిటల్ కాపీలతో పాటు ప్రింటెడ్ కాపీలను కూడా మీ వెంట ఉంచుకోండి. మీరు ప్రయాణించే విమానయాన సంస్థ (ఎయిర్‌లైన్స్) నిబంధనలను కూడా ఒకసారి చెక్ చూసుకోండి, ఎందుకంటే వారు వీసా సరిగ్గా ఉంటేనే బోర్డింగ్ అనుమతిస్తారు.
