
ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ పై ICICI బ్యాంకు యూటర్న్ తీసుకుంది. కొత్త ఖాతాలకు కనీస బ్యాలెన్స్ తగ్గించింది. ఇటీవల ఖాతాల్లో ఉంచాల్సిన కనీస బ్యాలెన్స్ ను భారీగా పెంచిన ఐసీఐసీఐ బ్యాంకు.. కస్టమర్లనుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
కస్టమర్లనుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో దేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ICICI బ్యాంక్ పట్టణ ప్రాంతాల్లోని కొత్త కస్టమర్లకు కనీస సగటు బ్యాలెన్స్ (MAB) నిబంధనను రూ.50వేలనుంచిరూ.15వేలకు తగ్గించింది. సెమీ-అర్బన్ ప్రాంతాల్లో ఈ పరిమితిని రూ.25వేల నుంచి రూ.7వేల500 కు తగ్గించింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో రూ.2వేల500గా నిర్ణయించింది.
అంతకు ముందు ఆగస్ట్ 1, 2025నుంచి కొత్త ఖాతాలపై పట్టణ ప్రాంతాల్లో కనీసం బ్యాలెన్స్ రూ.50వేలు, సెమీ అర్భన్ లో రూ.25వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు గా నిర్ణయించింది. తీవ్రమైన వ్యతిరేకత రావడంతో బ్యాంక్ వెనక్కి తగ్గింది.
అయితే పెంచిన కనీస బ్యాలెన్స్ తిరిగి త గ్గించినా .. మునుపటి కనీస బ్యాలెన్స్ కంటే ఎక్కువగానే ఉంది. పట్టణ ప్రాంతాల్లో గతంలో రూ.10వేలు ఉండగా.. ఇప్పుడు రూ. 15వేలుగా ఉంది. అదే సెమీ అర్బన్ లో గతంలో రూ.5వేలు ఉండగా ప్రస్తుతం 7వేల 500 అంటే 2వేల 500 లు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో గతంలో రూ. 2వేలు ఉండగా ప్రస్తుతం రూ. 2వేల 500లకు కనీస బ్యాలెన్స్ అంటే 500లు పెంచారు.
బ్యాంక్ ప్రకటన మేరకు..ఈ నిబంధనలు జూలై 31, 2025కి పూర్వం ప్రారంభించిన ఖాతాలపై వర్తించవు. అలాగే జీతఖాతాలు, 60 ఏళ్లకు పైబడిన పెన్షనర్లకు, BSBDA/PMJDY ఖాతాలపై కూడా వర్తించవు.
మినహాయింపులు: 60 ఏళ్ల కంటే తక్కువ వయసు గల పెన్షనర్లు, నిబంధన ప్రకారం ఎంపికైన విద్యార్థులు కనీస బ్యాలెన్స్ నిబంధన నుంచి మినహాయింపునకు అర్హులు.
కనీస బ్యాలెన్స్ కలిగి ఉండకపోతే ఖాతాదారులకు 6శాతంలేదా రూ.500 జరిమానా విధిస్తారు.
భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ SBI 2020లో కనీస బ్యాలెన్స్ నిబంధనను పూర్తిగా రద్దు చేసింది. చాలా ప్రభుత్వ బ్యాంకులు రూ.2వేల నుంచి రూ.10వేల వరకే కనీసం బ్యాలెన్స్ పరిమితులు కొనసాగిస్తున్నాయి.
ఈ మార్పులతో ICICI బ్యాంక్ కస్టమర్ల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సంస్థ తమ వృద్ధి ప్రణాళికలను ఆయా ప్రాంతాలలో సమతుల్యంగా అమలుచేయాలనే దిశగా అడుగులు వేసింది.