చాన్స్ ఇస్తే చార్మినార్​నూ కట్టినమంటరు

చాన్స్ ఇస్తే చార్మినార్​నూ కట్టినమంటరు
  • కాంగ్రెస్​ పాలనలో పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేసెటోళ్లు
  • అంబేద్కర్​పై ఇప్పుడు భట్టికి ప్రేమ పొంగిపర్లుతున్నదే
  • తెలంగాణను ప్రపంచం మొత్తం గుర్తిస్తున్నదని వ్యాఖ్య

హైదరాబాద్‌, వెలుగు :‘‘భట్టి విక్రమార్కకు అవకాశం ఇస్తే చార్మినార్‌, గోల్కొండ తామే(కాంగ్రెస్​ పార్టీ) కట్టినమని చెప్పుకుంటరు. వాటికి రాజీవ్‌, ఇందిరా గాంధీ పేరు పెట్టాలని డిమాండ్‌ చేస్తరు. అంత మహానుభావుడు భట్టి” అని మున్సిపల్​ శాఖ మంత్రి కేటీఆర్​ దుయ్యబట్టారు. ‘‘హౌస్‌లో ప్రతిపక్షం నామమాత్రంగా ఉంది. కన్‌స్ట్రక్టివ్‌ ఇన్‌పుట్స్‌ ఇవ్వమంటే ఏదో మొత్తం కాంగ్రెస్‌ చేసినట్లు మాట్లాడారు. మా తాతలు నేతులు తాగారు, మా మూతుల వాసన చూడండి.. అన్నట్లు చాలా పెద్ద ఉపన్యాసం ఇచ్చారు. ఊకదంపుడు ఉపన్యాసం అంటే ఏంటో భట్టి విక్రమార్క ఉపన్యాసం విన్నాక అర్థమైంది” అని  విమర్శించారు.

భట్టి చెప్పినదాంట్లో విషయంలేదని, గత సమావేశాల్లో మాట్లాడిందే మాట్లాడారని, అరిగిపోయిన గ్రామ్‌‌ ఫోన్‌‌ రికార్డులా, పాత చింతకాయ పచ్చడిలా..చెప్పిందే చెప్పారని దుయ్యబట్టారు. ‘‘ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపిరికట్టెది ఒక దారి. రాజధాని పట్ల భట్టికి కడుపు మంట. భట్టి మాట్లాడే మాటలు వింటుంటే అసాధారణంగా అనిపించింది. ఎంజీఆర్‌‌ఐ, బీడీఎల్‌‌, బీహెచ్‌‌ఈఎల్‌‌ తెచ్చాం అంటున్నరు. వాస్తవం.. మేం కాదనడంలేదు. మాకు ఆ సంస్కారం ఉంది. పని చేస్తే చేసినం అని చెప్తం. మీలాగ ఐదేండ్లలో ఏమీ జరగలేదు.. దివాలా తీసింది.. ఉపాధి పోయిందని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వం. మైకు ముందు ఆవేశంగా ఊగిపోతూ టీఆర్‌‌ఎస్‌‌ను బద్నాం చేయాలని చూస్తున్నరు. ఇకనైనా వట్టి మాటలు కట్టిపెట్టి, గట్టిమేలు తలపెట్టాలి’’ అని కేటీఆర్‌‌ వ్యాఖ్యానించారు.  గ్రేటర్​ హైదరాబాద్​ అభివృద్ధిపై బుధవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడిన అంశాలపై కేటీఆర్​ సమాధానమిచ్చారు. కేటీఆర్‌‌తోపాటు మంత్రులు తలసాని, వేముల ప్రశాంత్‌‌ రెడ్డి ఎదురు దాడికి దిగారు. ‘‘ప్రభుత్వంపై భట్టి విక్రమార్క చాలా అభాండాలు వేస్తున్నరు. ఇది మంచిది కాదు. ఇప్పటికైనా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలి’’ అని కేటీఆర్​ సూచించారు. ‘‘ఔటర్‌‌ రింగ్‌‌పై మధిరకు పోయి వచ్చేటప్పుడైనా భట్టికి చుట్టూ బిల్డింగ్‌‌లు కనిపించడంలేదా..? డబుల్‌‌ బెడ్‌‌ రూమ్‌‌లు కడుతుంటే ఏం చేయలేదనేలా మాట్లాడటం ఎంత వరకు సబబో ఆలోచించుకోవాలి. కుత్బుల్లాపూర్‌‌, నిజాంపేట్, ప్రగతి నగర్‌‌ లాంటి ప్రాంతాల్లో భట్టి ప్రభుత్వ హయాంలో 15 రోజులకోసారి నీళ్లు వచ్చేవి. ఇప్పుడు రోజు విడిచి రోజు నీళ్లు వస్తున్నాయి. ఓల్డ్‌‌ సిటీలో ఐటీ ఇండస్ట్రీస్‌‌ వస్తున్నయ్​. అక్కడ ఇవ్వడానికి జాగ కూడా లేదు. అమెజాన్‌‌ లాంటి కంపెనీలు కూడా వచ్చాయ్​ ఇవన్నీ భట్టిని తీసుకెళ్లి చూపిస్తం. నెక్ట్స్‌‌ సెషన్‌‌ అయినా మంచి మాటలు చెప్తరు” అని  ఆయన అన్నారు.

ఇందిరా పార్కు,జలమండలి వద్ద ధర్నాలు చేసేటోళ్లు..

గత ప్రభుత్వాల హయాంలో కోటి మంది ఉండే హైదరాబాద్‌‌లో మార్కెట్లు లేవని, కనీసం టాయిలెట్లు కూడా కట్టించలేదని కేటీఆర్‌ విమర్శించారు. టీఆర్‌‌ఎస్‌‌ వచ్చాక 20 మార్కెట్లు, 150 టాయిలెట్లు కట్టించిందన్నారు. గతంలో పారిశ్రామికవేత్తలు ఇందిరాపార్కు వద్ద ధర్నాలు చేసేటోళ్లని, 2014 వరకు జలమండలి వద్ద ఎప్పుడూ కుండలతో ధర్నాలు చేసేవారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎక్కడా ఆ పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌ పార్టీ దివాలా తీసిందన్నారు. ఆ పార్టీ దుకాణం బందైందని చెప్పారు. గాంధీ భవన్‌‌కు టులెట్‌‌ బోర్డు పెట్టుకునే పరిస్థితి దాపురించిందని కేటీఆర్‌‌ విమర్శించారు.  ‘‘బస్తీ దవాఖానాలు పెట్టాలన్న సోయి కాంగ్రెస్‌‌కు లేదు. మెట్రో రైలును కాంగ్రెస్‌‌ పార్టీనే ప్రారంభించింది. కానీ పూర్తి చేసింది మాత్రం మేమే. రాజధానిలో ఇంత అభివృద్ధి జరిగితే కడుపు మంట ఎందుకో అర్థం కావడంలేదు. 2014 వరకు ఖమ్మం పట్నం ఎట్ల ఉండేదో భట్టి గుండెల మీద చేయి వేసుకుని చెప్పాలి. ఖమ్మంలో లక్కారం చెరువు ఎంత అద్భుతంగా తయారైందో ఆ జిల్లాలో ఒక్క భట్టిని తప్ప ఎవరిని అడిగినా చెప్తరు. ఒప్పుకోవడానికి భట్టికి మాత్రం మనసొప్పడంలేదు. తెలంగాణను ప్రపంచం మొత్తం గుర్తిస్తోంది. కానీ భట్టి మాత్రం నిరాకరిస్తున్నరు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

అంబేద్కర్‌‌పై భట్టికి ప్రేమ పొంగిపొర్లుతోంది

‘‘1952లో మొట్టమొదటి ఎన్నికల్లోనే అంబేద్కర్‌‌ను పార్లమెంట్‌‌లో అడుగుపెట్టకుండా ఓడించించింది కాంగ్రెస్‌‌ పార్టీ. 50 ఏండ్లు అధికారంలో ఉంటే కనీసం అంబేద్కర్‌‌కు భారతరత్న ఇవ్వలేదు. ఇయ్యాళ అంబేద్కర్‌‌పై భట్టికి ప్రేమ పొంగిపొర్లుతోంది. దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్‌‌ విగ్రహాన్ని పెట్టినం. బోరబండకు పోయి చూడండి. సెంటర్‌‌ ఫర్‌‌ దళిత్‌‌ స్టడీస్‌‌ వద్ద 28  ఫీట్ల అంబేద్కర్‌‌ విగ్రహాన్ని ఆవిష్కరించినం. అతి త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద 125 అడుగు విగ్రహాన్ని ఆవిష్కరిస్తం. అంబేద్కర్‌‌ పేరు చెప్పుకొని రాజకీయ చేయడం కాదు’’ అని కేటీఆర్‌ విమర్శించారు.  ఆయన బతికున్నప్పుడు గౌరవించి ఉంటే కాంగ్రెస్‌‌ పార్టీకి దళితుల ఆదరణ ఉండేదని, గౌరవం ఇవ్వలేదు కాబట్టే కాంగ్రెస్​ ఎటుకాకుండా పోయిందని ఎద్దేవా చేశారు.  ఓల్డ్‌‌ సిటీని అభివృద్ధి చేస్తున్నామని, పెండింగ్‌‌ ప్రాజెక్ట్‌‌లు ఉంటే త్వరలో అక్బరుద్దీన్‌‌తో భేటీ అవుతామని ఆయన చెప్పారు.

భట్టి.. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది..: వేముల

సభలో భట్టి మాట్లాడుతుండగ వెంటనే ఆర్‌‌అండ్‌‌ బీ మినిస్టర్‌‌ వేముల ప్రశాంత్‌‌ రెడ్డి జోక్యం చేసుకున్నారు. భట్టి.. తెలంగాణ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అన్నారు.  కేసీఆర్‌‌ ఉద్యమం చేస్తున్న సమయంలో.. తెలంగాణ అక్కర్లలేదంటూ, అభివృద్ధి చేసుకుందామంటూ, ఆ తర్వాతే తెలంగాణ తీసుకుందామంటూ వైఎస్‌‌ రాజశేఖర్‌‌ రెడ్డికి వంత పాడిన వ్యక్తి భట్టి అని, అలాంటి వ్యక్తి తెలంగాణ గురించి మాట్లాడుతరా అని మంత్రి వేముల
ఆగ్రహం వ్యక్తం చేశారు.

భట్టీ..! ఇండ్లు చూపిస్త: తలసాని

వేముల మాట్లాడుతున్న టైంలోనే మంత్రి తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్‌‌ ఎంటర్‌‌ అయ్యారు. ‘‘భట్టి విక్రమార్క సత్యదూరమైన మాట్లాడుతున్నరు. డబుల్‌‌ బెడ్‌‌రూమ్‌‌ ఇండ్లు ఎక్కడక్కడ జరుగుతున్నాయో రేపు ఆయనకు చూపిస్తా. మీరు ఇట్ల చేస్తున్నరు కాబట్టే మీరు అక్కడ కూర్చున్నరు. మీకింకా బుద్ధి రావడంలేదు. లాస్ట్‌‌ టైం గ్రేటర్‌‌లో రెండు సీట్లు వచ్చాయి. ఇంకా బుద్ధి రాకపోతే మేమేం చేయలేం. డబుల్‌‌ బెడ్‌‌ రూం చూశాక. శాటిస్‌‌ఫై అయ్యాక ఇద్దరం కలిసి ప్రెస్‌‌ కాన్ఫరెన్స్‌‌ పెడదాం”అని తలసాని అన్నారు.