హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో అవసరమైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మళ్లీ విచారణకు పిలుస్తామని సిట్ చీఫ్ సజ్జనార్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం (జనవరి 23) కేటీఆర్‌ను సిట్ విచారించిన విషయం తెలిసిందే. దాదాపు 7 గంటల పాటు అధికారులు ఆయనను ఇంటరాగేట్ చేశారు. విచారణ అనంతరం కేటీఆర్ ఇన్వెస్టిగేషన్‌పై సీపీ సజ్జనార్ వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా 2026, జనవరి 23న విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చామని తెలిపారు. శుక్రవారం (జనవరి 23) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్ విచారణకు హాజరయ్యారని.. కేసుకు సంబంధించిన కీలక అంశాలపై ఆయన నుంచి సమాచారం సేకరించామని చెప్పారు. ఇప్పటికే లభ్యమైన ఆధారాలతో సిట్ లోతైన దర్యాప్తు చేసిందని పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన సాక్ష్యులను ప్రభావితం చేయొద్దని కేటీఆర్‌కు సూచించామని చెప్పారు.
2024లో నమోదైన ఈ కేసులో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమ ఫోన్ సర్వైలెన్స్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయన్నారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయవ్యవస్థకు చెందిన వ్యక్తులు సహా వేలాది మంది ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపణ ఉన్నాయని పేర్కొన్నారు.
అయితే.. ఫోన్ ఇంటర్‌సెప్షన్ జాతీయ భద్రత కారణంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని గుర్తించామని.. ఇలాంటి అన్‌వెరిఫైడ్ కథనాలను సిట్ పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. కేసులో సిట్ దర్యాప్తు పూర్తిగా చట్టబద్ధంగా, న్యాయపరంగా, వృత్తిపరంగా కొనసాగుతోందని తెలిపారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని, అధికారిక వర్గాల సమాచారం మాత్రమే నమ్మాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
