అవమానాలు భరించి జాతికి ఆదర్శం అయ్యారు

అవమానాలు భరించి జాతికి ఆదర్శం అయ్యారు
  • మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య

హైదరాబాద్: చరిత్రలో ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్లందరూ ఎన్నో అవమానాలు, కష్టాలు భరించి జాతికి ఆదర్శం అయ్యారని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య తెలిపారు. సమాజం అభివృద్ధి చెందాలంటూ నిమ్న జాతులు, బడుగులు అభివృద్ధి చెందాలని.. అప్పుడే సమసమాజం ఏర్పడుతుందని ఆయన వివరించారు. ఆదివారం లకిడికపూల్ అంబేద్కర్ రిసోర్స్ సెంటర్ లో దళిత అమరుల శ్రద్ధాంజలి సభ జరిగింది. కార్యక్రమంలో జస్టిస్ చంద్రయ్య, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ప్రజా గాయకుడు గద్దర్ తదితరులు పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ ముగ్గురు దళిత జాతి ప్రముఖులు అమరులయ్యారని, వారికి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. సమాజం మారాలి అంటే వ్యక్తులు మారాలి, వ్యక్తుల ఆలోచనలు మారాలన్నారు. మరీ ముఖ్యంగా నిమ్న జాతులు, బడుగులు అభివృద్ధి చెందితేనే సమసమాజం సాకారం అవుతుందన్నారు. గాంధీ, అంబేద్కర్ లాంటి వారు కూడా ఎన్నో వివక్షలు, అవమానాలు భరించారు, అందుకే వాళ్ళు జాతికి ఆదర్శం అయ్యారు, గాంధీ ఇజం, అంబేద్కర్ ఇజం వచ్చాయి, తెలంగాణకు చెందిన ఈ ముగ్గురు అమరులు కూడా అంబేద్కర్ అడుగు జాడల్లో నడిచారని కొనియాడారు. ఈ సమాజం గొప్ప నాయకులను కోల్పోయిందన్నారు. ఈరోజుల్లో రాజకీయ నాయకులు మరణిస్తే చాలా మంది వస్తున్నారు, కానీ సామాజిక కార్యకర్తలు చనిపోతే రావట్లేదన్నారు. ఈ ముగ్గురు కూడా నిమ్న జాతి అభివృద్ధి కోసం జీవితాంతం పోరాడారని గుర్తు చేస్తూ ప్రతి మనిషికి కూడా పుట్టుక, చావు రెండు ఉంటాయి, బతికినంత కాలం మనం ఏం చేశామనేది ముఖ్యమన్నారు. అంబేద్కర్ జీవితాంతం బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేశారు, రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక హక్కులు కల్పించిందన్నారు. అంబేద్కర్ గనుక రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులు కాకపోయి ఉంటే పరిస్థితి వేరే లాగా ఉండేది కాబోలు అని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరం కృషి చేసి, వారి అడుగు జాడల్లో నడుద్దామని జస్టిస్ చంద్రయ్య పిలుపునిచ్చారు.