ఆస్పత్రిలో టెస్టులు రాస్తే.. బయటకు పోవాల్సిందే

ఆస్పత్రిలో టెస్టులు రాస్తే.. బయటకు పోవాల్సిందే

 భద్రాచలం ఏరియా ఆసుపత్రి ఎదుట రోగుల ఆందోళన

సిటి స్కానింగ్‌‌‌‌ పేరిట ప్రైవేట్‌‌‌‌ ల్యాబ్‌‌‌‌ల్లో దోపిడీ

భద్రాచలం, వెలుగు: సర్కారు దవాఖానకు వస్తే బయటకు మెడికల్ టెస్టులు రాస్తున్నరు. ఆసుపత్రిలో ల్యాబ్‌‌‌‌ ఉన్నా ప్రైవేట్ ల్యాబ్‌‌‌‌లకు టెస్టులు రాయడంపై విమర్శలు వస్తున్నాయి. తమ జేబులు గుల్లా చేసేందుకే ప్రైవేటు ల్యాబ్‍లతో డాక్టర్లు కుమ్మక్కు అవుతున్నారని సోమవారం పలువురు రోగులు భద్రాచలం ఏరియా ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఏజెన్సీ పెద్దాసుపత్రి అయిన భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో నిత్యం జరుగుతున్న తంతే. ప్రతీ చిన్న పరీక్షకు కూడా ప్రైవేటు ల్యాబ్‍లకు వెళ్లాలంటూ చీటీలు రాసిస్తున్నరు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతోపాటు వైద్యుల ఇష్టారాజ్యం, సిబ్బంది చేతివాటం కలిపి పేద రోగుల జేబులకు కన్నం పడుతోంది. ఒక్క సీటీ స్కానింగ్‌‌‌‌ మినహా అన్ని రకాల మెడికల్‌‌‌‌ టెస్టులు చేసేందుకు సౌకర్యాలు ఉన్నాయి. అయినా ప్రైవేటు ల్యాబ్‍లకు రోజూ చీటీలు రాస్తున్నారంటే వైద్యుల కమీషన్‌‌‌‌ కక్కుర్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అత్యవసరం అంటూ హడావుడి..

నిరుపేదలు వైద్యం కోసం ఏరియా ఆసుపత్రికి రాగానే వైద్యులు నానా హడావుడి చేస్తున్నారు. ఆసుపత్రిలోని ల్యాబ్‍ల్లో మెడికల్‌‌‌‌ టెస్టులు చేసినా అత్యవసరం అంటూ.. కచ్చితమైన రిజల్ట్‌‌ అంటూ బయట ల్యాబ్‍ల్లో టెస్టులు చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. ప్రైవేటు ల్యాబ్‍ల్లో టెస్టులు చేయించుకున్న వారినే డాక్టర్లు చూస్తున్నారు. ఏరియా ఆసుపత్రి ల్యాబ్‍లో చేయించుకుంటే అసలు పట్టించుకోవడం లేదు. కమీషన్ల కోసం డాక్టర్లు కక్కుర్తి పడి నిరుపేదలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

సిటి స్కానింగ్‌‌ పేరిట దగా

కరోనా వైరస్‌‌‌‌ నిర్ధారణ కోసం సిటి స్కానింగ్‌‌‌‌ పేరుతో దోపిడీకి దిగుతున్నారు. భద్రాచలం పట్టణంలోని కొందరు ప్రైవేటు వైద్యులు సిండికేట్‍గా మారి సీటీ స్కానింగ్‌‌‌‌ సెంటర్‍ను ఏర్పాటు చేశారు. ముందుగా రూ.1600 మాత్రమే తీసుకున్న ఈ సెంటర్‌‌‌‌‌‌‌‌ నిర్వాహకులు కరోనాతో తమ వ్యాపారానికి బాటలు వేసుకున్నారు. రూ.3500 నుంచి రూ.3800 వరకు వసూలు చేస్తున్నారు. ర్యాపిడ్‌‌‌‌ యాంటీజెన్‌‌‌‌ కిట్ల ద్వారా కరోనా టెస్టులు చేస్తుండగా.. ఈ పరీక్షల్లో నెగిటివ్‌‌‌‌ అని వస్తోంది. దీంతో ఆర్టీపీసీఆర్‌‌‌‌‌‌‌‌ పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు బయట సిటి స్కానింగ్‌‌‌‌కు పంపిస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా ఏరియా ఆసుపత్రి నుంచి ఈ టెస్టులు రాస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమీషన్‌‌‌‌ కూడా దొరుకుతోందని తెలుస్తోంది. పర్యవేక్షించాల్సిన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మౌనంగా ఉండిపోతున్నారు.

భద్రాచలం పట్టణంలోని ఓ హోటల్‌‌‌‌ వ్యాపారికి ఇటీవల కరోనా వచ్చింది. ఆయన తన కుటుంబ సభ్యులకు కూడా టెస్ట్ చేయించేందుకు నాలుగు సార్లు సిటి స్కానింగ్‌‌‌‌ చేయించారు. ఆయన వద్ద రూ.3500 చొప్పున ముక్కుపిండి మరీ వసూలు చేశారు. ఇదేం బాదుడు..? అని ప్రశ్నిస్తే రిస్క్‌‌‌‌తో కూడిన పని అని నిర్వాహకులు చెప్పడం గమనార్హం. అయితే రేటు ఎక్కువగా తీసుకుంటే రిస్క్ ఉండదా..? అని ప్రశ్నిస్తే వారు నేలచూపులు చూస్తున్నారు.

దుమ్ముగూడెం మండలం సీతానగరం నుంచి డెలివరీ కోసం వచ్చిన మహిళను టెస్టుల పేరుతో ఏరియా ఆసుపత్రి వైద్యులు వేధించారు. ఈ బాధను భరించలేక స్థానిక కాంగ్రెస్‌‌‌‌ నేతల దృష్టికి తీసుకెళ్లడంతో వారు ఆందోళన చేపట్టారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ డీసీహెచ్‍కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఇక భద్రాచలానికి చెందిన మరో మహిళ కూడా డెలివరీ కోసం వస్తే వరుసగా రెండు రోజులు మెడికల్ టెస్టులు చేయించారు. టెస్టుల పేరుతో జేబులు గుల్ల చేసుకోవాలి. డెలివరీ చేయాలంటే చేతులు తడపాల్సి వచ్చిందని బాధిత మహిళ కుటుంబసభ్యులు వాపోయారు.

ఇబ్బంది పెడుతున్నరు

టెస్టుల పేరుతో ఇబ్బంది పెడుతున్నరు. డెలివరీ కోసం వస్తే ప్రతీ పనికి డబ్బులు అడు గుతున్నరు. బయట టెస్టులు చేయించుకు న్న వారిని ఒకలా, ఆసుపత్రిలో టెస్టులు చేయించుకున్న వారిని మరోలా చూస్తున్నరు. – చాట్ల శివకృష్ణ,  సీతానగరం

ధరల బోర్డు పెట్టాలి

ప్రతీ ల్యాబ్‌‌‌‌ వద్ద నిర్వాహకులు ఏ టెస్టుకు ఎంత రేటు అనే బోర్డును అర్థమయ్యేలా ఏర్పాటు చేయాలి. స్కానింగ్‌‌‌‌ సెంటర్లో అధిక ధరల వసూలు విషయం నా నోటీసుకు ఇప్పుడే వచ్చింది. పరిశీలిస్తాను. గవర్నమెంట్ ఆసుపత్రిలో ల్యాబ్‍లు ఉండగా బయటకు టెస్టులు రాయకూడదు. ఎవరైనా బాధితులు ఫిర్యాదు చేస్తే విచారిస్తాం. -డా.శ్రీనివాసరావు, అడిషనల్‌‌‌‌ డీఎంహెచ్‌‌‌‌వో.