ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే సమ్మెకు దిగుతాం

ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే సమ్మెకు దిగుతాం
  • సర్కార్ దవాఖానల్లో కాంట్రాక్టు కార్మికుల ఆందోళన
  •  సీఎం, హెల్త్ మినిస్టర్,అధికారులు చెప్పినా పట్టించుకోవడం లేదు

సీఎం,హెల్త్ మినిస్టర్, ఉన్నతాధికారులు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కావడం లేదని సర్కార్ దవాఖానల్లో పని చేస్తున్నశానిటేషన్‌, పేషెంట్స్ కేర్‌, సెక్యూరిటీ కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేశారు. మూడ్రోజులు కింగ్ కోఠి జిల్లా హాస్పిటల్లో నిరసన తెలిపినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆదివారం ఫీవర్, ఉస్మానియా, నిలోఫర్, పేట్లబురుజు, కింగ్ కోఠి, నాంపల్లి ఏరియా, సరోజినిదేవి ఆస్పత్రుల్లోని కార్మికులందరూ కలిసి రెండు గంటలు డ్యూటీలు బహిష్కరించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఫీవర్ హాస్పిటల్ వద్ద మెడికల్‌ కాంట్రాక్టు ఎంప్లాయీస్, వర్కర్స్‌ యూనియన్‌ హైదరాబాద్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఎం.నర్సింహ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్స్ లో కరోనా వారియర్స్ గా పనిచేస్తున్న కార్మికులకు 10శాతం ఇన్సెంటివ్స్ ఇస్తామని మార్చిలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా నేటికీ అమలు చేయడం లేదన్నారు . నెల రోజుల కిందట మంత్రి ఈటల రాజేందర్ కార్మికులకు ప్రోత్సాహకం అందిస్తామని చెప్పినా ఇప్పటికీ అందించలేదన్నారు. హాస్పిటల్స్ లో పనిచేసే ప్రతి ఒక్కరికీ వారం పని చేస్తే మరో వారం క్వారంటైన్ లీవ్స్ ఇస్తామని ఉన్నతాధికారులు చెప్పా రని, అవి కూడా ఇవ్వడం లేదన్నారు. హామీలు అమలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. లేకుంటే అన్ని హాస్పిటల్స్ లో డ్యూటీలు బంద్ పెట్టి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.