- కోర్టుల ఆదేశాలను గౌరవిస్తూనే విధులు నిర్వహిస్తున్నం
- హైడ్రాతో చెరువులను, పర్యావరణాన్ని కాపాడుతున్నం
- ఇప్పటికి 80 వేల కోట్ల విలువైన 2,093 ఎకరాలను కబ్జాల నుంచి విడిపించినం
- మేం కాపాడిన భూములు ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లకు ఉపయోగపడ్తున్నాయి
- బతుకమ్మకుంట ముమ్మాటికీ చెరువే
- ఫాతిమా కాలేజ్ ఇష్యూ కోర్టు పరిధిలో ఉందని వెల్లడి
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ఎక్కడా పేదల ఇండ్లు కూల్చడంలేదని, తమకు ఆ ఉద్దేశం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఒకవేళ ఎఫ్టీఎల్ పరిధిలో ఎక్కడైనా పేదలవి తాత్కాలిక ఇండ్లు ఉండి, తప్పనిసరి పరిస్థితుల్లో కూల్చాల్సి వస్తే.. వారికి ప్రత్యామ్నాయంగా బీపీఎల్ కింద డబుల్ బెడ్రూం ఇండ్లను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అలాగే, ఓనర్‌షిప్ హక్కులు ఉన్న వారికి టీడీఆర్ (ట్రాన్స్‌ఫరెబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) అందిస్తామన్నారు.
ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలు పెట్టామని చెప్పారు. శనివారం బుద్ధభవన్‌లోని హైడ్రా ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో వివిధ అంశాలపై రంగనాథ్ మాట్లాడారు. మాదాపూర్‌లోని సున్నం చెరువు, ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతాపూర్ చెరువులో ఇండ్లను కోల్పోయిన పేదలకు డబుల్ ఇండ్లను ఇస్తామన్నారు. హైకోర్టు ఆదేశాలను పాటిస్తూనే విధులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
బతుకమ్మ కుంట ఒక చెరువే.. ఆధారాలున్నయ్..
అంబర్‌పేటలోని బతుకమ్మకుంట ముమ్మాటికీ చెరువే అని, ఇందుకు సంబంధించి శాటిలైట్, గూగుల్ మ్యాప్స్‌తో చారిత్రక ఆధారాలున్నాయని, వాటి ఆధారంగానే చెరువును అభివృద్ధి చేశామని రంగనాథ్ తెలిపారు. బతుకమ్మ కుంట చెరువు భూమి తనదే అని, అక్కడ తాను వ్యవసాయం కూడా చేసినట్టు ఎడ్ల సుధాకర్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించిన అంశంపై స్పందించారు.
1986 నాటి అన్ రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ మాత్రమే ఆయన వద్ద ఉందని, రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఉంటేనే చెల్లుబాటు అవుతుందని చెప్పారు. బతుకమ్మకుంట అభివృద్ధిపై డివిజన్ బెంచ్‌కు సుధాకర్ రెడ్డి వెళ్లారని.. కంటెంప్ట్ ఆర్డర్‌లో కోర్టు తమను తప్పుపట్టిందని చెప్పారు. డివిజన్ బెంచ్ ఆదేశాల ప్రకారం అక్కడ బోర్డులు, ఇతర నిర్మాణాలు తొలగించామని వెల్లడించారు. హైకోర్టు ఆదేశాలను తాము పాటిస్తామని స్పష్టం చేశారు.
1975లో ఇరిగేషన్ రికార్డుల్లో కుంటగానే ఉందని, సర్వే నంబర్ 563/1 లో 9.19 ఎకరాల వరకూ చెరువున్నట్టు రెవెన్యూ, జీహెచ్ ఎంసీ రికార్డులు చెబుతున్నాయన్నారు. ఆ చెరువుకు కట్ట 563/2 సర్వే నంబరులో 6 గుంటల మేర మాసాన్ కట్ట పేరిట ఉందని చెప్పారు. గ్రామ రికార్డులతో పాటు.. 1971లో సర్వే ఆఫ్ ఇండియా ఫొటోలు, 1989లో నాసా (ల్యాండ్‌శాట్) రూపొందించిన శాటిలైట్ పిక్చర్స్ ఉన్నాయన్నారు.
బతుకమ్మకుంటపై తుది తీర్పు వచ్చే వరకూ దీనిమీద ఎవరూ ఓనర్‌షిప్ క్లెయిమ్ చేయకూడదనే నిబంధనల మేరకు బోర్డులు, గేట్లు తొలగించామని చెప్పారు. చెరువు చుట్టూ వేసిన ఫెన్సింగ్‌ను తొలగిస్తే ప్రమాదాలు జరుగుతాయని సుప్రీంకోర్టుకు సందర్భంగా తెలిపామన్నారు. వివరణతో 3 వారాల్లో అఫడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు సూచించిందన్నారు.
సల్కం చెరువు విషయంలో కోర్టు తప్పు పట్టలే..
సల్కం చెరువు విషయంలో కూడా కోర్టు హైడ్రాను తప్పు పట్టలేదని రంగనాథ్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలు హైడ్రా కోరిన విషయాన్ని కూడా హైకోర్టు తీర్పులో పేర్కొందని.. ఇరిగేషన్, రెవెన్యూ నుంచి వచ్చిన నివేదిక మేరకు చర్యలుంటాయని స్పష్టం చేశారు. ఎంఎంయూడీ, ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్లు కూడా వివరాలు సమర్పించాలని, అక్కడ నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అనుమతులున్నాయా? లేదా? అక్కడ కొనసాగుతున్న కాలేజీకి సంబంధించి విద్యాశాఖ అనుమతుల వివరాలు సమర్పించాలని కోర్టు కోరిందన్నారు.
కోర్డు ఆదేశాలు పాటిస్తున్నం..
కోర్టుల సూచనల మేరకు ఆక్రమణలో నివాసాలుంటే ముందుగా వారికి సమాచారం ఇచ్చి ఖాళీ చేయించే పనిని చేపడుతున్నామని రంగనాథ్ తెలిపారు. ఐలాపూర్‌లో పేదల ఇండ్ల జోలికి వెళ్లలేదని చెప్పారు. అక్కడ ముఖీం సోదరుడు అజీం నిర్మించిన ఆరంతస్తుల అపార్టుమెంట్‌ను తొలగించినప్పుడు కూడా ముందుగా వారిని ఖాళీ చేయాలని చెప్పామని, అయినా ఖాళీ చేయకపోవడంతో హైడ్రా సిబ్బంది సహకరించి అందరూ ఖాళీ చేశాకే ఆ భవనాన్ని తొలగించామని తెలిపారు.
4 పెద్ద చెరువుల అభివృద్ధి..
మొదటి విడతగా 6 చెరువులను పునరుద్ధరిస్తున్నామని, ఇందులో ఇప్పటికే మూడింటిని ప్రారంభించామని రంగనాథ్ వెల్లడించారు. రెండో విడతగా 14 చెరువుల పునరుద్ధరణను చేపడుతున్నామని, ఇవి కాకుండా అంబీర్ చెరువు, ఫాక్స్ సాగర్, సరూర్ నగర్, అమీన్ పూర్ ఈ 4 పెద్ద చెరువులను కూడా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సర్కారుకు పంపామన్నారు. చెరువుల స్థలాల్లో నిర్మాణాలు చేపడతామంటే కుదరదని తెలిపారు.
త్వరలో సీఎస్‌ఆర్ ద్వారా డెవలప్..
నగరంలో వందల సంఖ్యలో చెరువులు ఉన్నాయని, ఇందులో చిన్న చెరువులను గుర్తించి సీఎస్‌ఆర్ ( కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ఫండ్స్‌తో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, ఈ దిశగా హైడ్రా చర్యలు తీసుకుంటుందని రంగనాథ్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి గతంలో మాదిరిగానే జీహెచ్ఎంసీ ఈ బాధ్యతలు తీసుకుంటుందని చెప్పారు. అయితే బాధ్యతతో పనులు చేసేవారికి మాత్రమే సీఎస్‌ఆర్ కింద అప్పగిస్తామని, వారి సొంత ప్రయోజనాల కోసం డెవలప్ చేసేవారికి అప్పగించబోమన్నారు.
మాన్సూన్‌కు సిద్ధంగా ఉన్నం..
రాబోయే వర్షాకాలాన్ని ఎదుర్కొనేందుకు హైడ్రా సిద్ధంగా ఉందని రంగనాథ్ తెలిపారు. ఈ ఏడాది వర్షాభావం తక్కుంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిందని చెప్పారు. ప్రధాన నాలాలు, మురుగు కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించే పనులు జరుగుతున్నాయన్నారు. వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా పనులు చేస్తున్నామని చెప్పారు.
30 వేల ఫిర్యాదులు వచ్చాయి
ఇప్పటివరకూ 30 వేల ఫిర్యాదులు వచ్చాయని, హైడ్రాలో ఆఫీసర్లు 50 మంది ఉన్నారని, ఇవన్నీ ఒకేసారి పరిశీలించడం వీలుకాదని రంగనాథ్ తెలిపారు. ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే దానికి సంబంధించి అన్ని విధాలుగా విచారించి చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు.
రూ.80 వేల కోట్ల విలువైన భూములు కాపాడినం...
హైడ్రా ఇప్పటి దాకా 2,093 ఎకరాలను స్వాధీనం చేసుకుందని రంగనాథ్ తెలిపారు. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న ఆక్రమణలు తొలగించి 296.12 ఎకరాలు, నాలాలకు సంబంధించి 24.05 ఎకరాలు, ప్రభుత్వ భూములు 1,606.34 ఎకరాలు, పార్కుల ఆక్రమణలు తొలగించి 92.24 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
రోడ్ల ఆక్రమణలు తొలగించి 49.28 ఎకరాలు, ఇతర ప్రభుత్వ స్థలాలు 23.17 ఎకరాలు ఇందులో ఉన్నాయన్నారు. వీటి విలువ రూ. 80 వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేశారు. హైడ్రా ఇప్పటివరకూ 90 కి పైగా కేసులు నమోదు చేసినట్టు చెప్పారు.
