- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హెచ్చరిక
- సమస్యలు పరిష్కరించాలంటూ ఇబ్రహీంపట్నంలో భారీ పాదయాత్ర
ఇబ్రహీంపట్నం, వెలుగు: ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రతిఘటన పోరాటాలకు సిద్ధమవుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హెచ్చరించారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు, భూ సమస్యలు పరిష్కరించాలని, ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేస్తూ సీపీఎం రంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఇబ్రహీంపట్నం నుంచి రంగారెడ్డి కలెక్టరేట్ వరకు భారీ పాదయాత్ర నిర్వహించారు.
ఈ యాత్రను జాన్ వెస్లీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల వర్ధంతిని పురస్కరించుకుని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక వైఖరికి నిరసనగా ఈ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న అనేక భూ సమస్యలు ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు.
పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులను మావోయిస్టుల నెపంతో అక్కడి నుండి వెళ్లగొట్టి, ఆ భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, కార్యదర్శివర్గ సభ్యులు సామెలు, రాం చందర్, ఏర్పుల నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
