మెున్నటి నీట్ పేపర్ లీక్ మర్చిపోక ముందే మరో వివాదం తెరపైకి వచ్చేసింది. తాజాగా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(IGNOU) పరీక్షల చుట్టూ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న 'జూన్-జూలై 2026' టర్మ్-ఎండ్ ఎగ్జామినేషన్స్ క్వశ్చన్ పేపర్లు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కేవలం రూ.199 చెల్లిస్తే చాలు.. పరీక్ష పేపర్ చేతికి వచ్చేస్తుందంటూ టెలిగ్రామ్ ఛానెళ్లలో విచ్చలవిడిగా ప్రచారం జరగడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.
ముఖ్యంగా మ్యాక్రోఎకనామిక్స్ అనాలిసిస్‌తో పాటు మరికొన్ని సబ్జెక్టుల క్వశ్చన్ పేపర్లు పరీక్షకు రెండు గంటల ముందే ఇస్తామని.. వీలైతే వాటికి జవాబులు కూడా అందిస్తామని టెలిగ్రామ్ గ్రూపుల్లో ఆఫర్లు పెట్టారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్లతో సహా కొందరు విద్యార్థులు జూన్ 3న యూనివర్సిటీ అధికారులకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన ఇగ్నో యాజమాన్యం.. జూన్ 4న అన్ని ప్రాంతీయ కేంద్రాల డైరెక్టర్లకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఈ క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంపై ఇగ్నో యాజమాన్యం మాత్రం పూర్తి భిన్నమైన క్లారిటీ ఇచ్చింది. ఇప్పటివరకు ఎలాంటి పేపర్ లీక్ కాలేదని.. దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా కేవలం వదంతులేనని, మోసగాళ్లు డబ్బులు వసూలు చేయడానికి ఆడుతున్న నాటకమని కొట్టిపారేసింది. ఎలాంటి పరీక్షలనూ రద్దు చేయడం లేదని ప్రకటిస్తూనే.. ఈ ఆన్‌లైన్ మోసాల వ్యవహారాన్ని వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపింది.
ఇలాంటి ఫిర్యాదులు పెరుగుతున్న వేళ పరీక్షా కేంద్రాల వద్ద భద్రతను మరింత కఠినతరం చేయాలని ఇగ్నో ఆదేశించింది. ప్రత్యేక అబ్జర్వర్లను రంగంలోకి దించడం, ఎగ్జామ్ సెంటర్ స్టాఫ్ ఎవరూ మొబైల్ ఫోన్లు వాడకుండా నిరోధించడం, అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధించడం, క్వశ్చన్ పేపర్లను సెంటర్ సూపరింటెండెంట్ల వ్యక్తిగత నిఘాలో భద్రపరచడం లాంటి కీలక చర్యలు చేపట్టింది. ఇటీవల నీట్ పేపర్ లీక్ వివాదంలోనూ టెలిగ్రామ్ ఛానెళ్లపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇగ్నో ఈ నిర్ణయాన్ని సీరియస్‌గా తీసుకుంది.
ఇదిలా ఉంటే.. జూన్ 9న జరిగిన మరో పొరపాటు ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోసింది. ఉదయం 10 గంటల సెషన్ ప్రారంభమైన తర్వాత, ఒక మాస్టర్స్ లెవెల్ పరీక్షకు తప్పుడు క్వశ్చన్ పేపర్ పంపామని గుర్తించిన యూనివర్సిటీ.. దాన్ని వాడొద్దని, పోర్టల్ నుండి సరైన పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలని కేంద్రాలకు సూచించింది. అప్పటికే కొన్ని కేంద్రాల్లో పరీక్ష ప్రారంభమైపోయి ఉంటుందని ఫ్యాకల్టీ ఆందోళన వ్యక్తం చేయగా.. దాదాపు 200 కేంద్రాలకు తప్పుడు పేపర్ వెళ్లిన మాట నిజమే కానీ, పరీక్ష ప్రారంభానికి ముందే దాన్ని గుర్తించి మార్చేశామని, తప్పుడు పేపర్‌తో ఎక్కడా ఎగ్జామ్ జరగలేదని ఇగ్నో స్పష్టమైన వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పరీక్షలు జూన్ 1 నుంచి జూలై 21 వరకు రెండు దశల్లో కొనసాగుతున్నాయి.
