ఐకేపీ వీఓఏల పోరుబాట .. మే 18 నుంచి సమ్మెకు సిద్ధం!

ఐకేపీ వీఓఏల పోరుబాట .. మే 18 నుంచి సమ్మెకు సిద్ధం!
  • సెర్ప్ సీఈవో ఆఫీసులో నోటీసు అందజేసిన జేఏసీ
  • డిమాండ్లు పరిష్కరించకుంటే పనులు ఆపేస్తామని వార్నింగ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్న ఐకేపీ వీఓఏలు (గ్రామ సంఘం సహాయకులు) మరోసారి పోరుబాట పట్టారు. తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌‌లోని సెర్ప్ సీఈవో కార్యాలయంలో రాష్ట్ర ఐకేపీ వీవోఏల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు సమ్మె నోటీసు అందజేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే క్షేత్రస్థాయిలో పనులన్నీ నిలిపివేస్తామని వారు హెచ్చరించారు. గ్రామాల్లో మహిళా సంఘాల నిర్వహణ, బ్యాంకు లింకేజీలు, రికార్డుల నమోదు వంటి కీలక పనులన్నీ చేస్తున్నప్పటికీ అందుతున్న వేతనం సరిపోవడం లేదని వీవోఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని పేర్కొన్నారు.

విజ్ఞప్తులు పట్టించుకోని ప్రభుత్వం..

వీఓఏల సమస్యలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని ఐకేపీ వీఓఏ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి శరత్ కుమార్  అన్నారు. కొన్నేళ్లుగా సమస్యల పరిష్కారం కోసం విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ సర్కార్​ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ నెల 18 నుంచి విధులను బహిష్కరించి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పవన్, నేతలు ఎం.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు

వీఓఏల డిమాండ్లు ఇవే..

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 18 వేల మంది వీఓఏలు పనిచేస్తున్నారు. మహిళా సంఘాలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సభ్యులకు చేరవేస్తూ క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నారు. అయితే జేఏసీ నాయకులు సెర్ప్ అధికారులకు సమర్పించిన వినతిపత్రంలో ఆరు ప్రధాన డిమాండ్లను ప్రస్తావించారు. ప్రస్తుత వేతనాన్ని సవరించి నెలకు కనీసం రూ.20 వేలుగా నిర్ణయించాలని, వీవోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి ప్రత్యేక హెచ్‌‌ఆర్ విధానాన్ని అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న అర్హులైన వీవోఏలకు వెంటనే కమ్యూనిటీ కోఆర్డినేటర్లుగా పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ప్రమాదాలు జరిగితే ఆదుకునేందుకు రూ.20 లక్షల సాధారణ ఆరోగ్య బీమా కల్పించాలలన్నారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో డిజిటల్ పనుల నిర్వహణ కోసం ప్రతి వీవోఏకు ట్యాబ్ సౌకర్యం కల్పించాలని, పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.