కేసీఆర్ ఫ్యామిలీ జైలుకెళ్లకపోతే నా పేరు మార్చుకుంటా: రాజగోపాల్ రెడ్డి

కేసీఆర్ ఫ్యామిలీ  జైలుకెళ్లకపోతే నా పేరు మార్చుకుంటా: రాజగోపాల్ రెడ్డి

కేసీఆర్ కుటుంబం జైలుకు పోకపోతే తన పేరు మార్చుకుంటానని బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్న  రాజగోపాల్ రెడ్డి.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వేల కోట్లు సంపాదించిన కేసీఆర్ కుటుంబం.. త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. తనపై  పేపర్ లో  వచ్చిన  ఓ కథనాన్ని ఖండించిన రాజగోపాల్ రెడ్డి... మీడియా మిత్రులంటే తనకెంతో గౌరవమని చెప్పారు. ఒక వ్యక్తి కోసం వార్త రాసే ముందు తెలుసుకొని రాయడం మంచిదని హితవు పలికారు. మునుగోడు ఎన్నికల్లో ఓడించేందుకు పోలీసులను అడ్డుపెట్టుకొని తెలంగాణ ముఖ్యమంత్రి వందల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. కాళేశ్వరం రీడిజైనింగ్ పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారని చెప్పారు. లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి కూతురు, గ్రానైట్స్ స్కాంలో మంత్రి గంగుల కమలాకర్స్, మంత్రి మల్లారెడ్డి వీరందరూ దోచుకున్న ప్రజాధనాన్ని తిరిగి కక్కించి జైలుకు పంపడం ఖాయమన్నారు. 

 ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కావాలని టీఆర్ఎస్ రాజకీయ లబ్ధి కోసం బీజేపీపై కావాలని నింద మోపుతుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పాల్గొన్న నలుగురు ఎమ్మెల్యేలు పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కదని చెప్పారు. అలాంటి ఎమ్మెల్యేలను బీజేపీ ఎందుకు కొనుగోలు చేస్తుంది.. ఆనాటి నుండి ప్రతిపక్షం లేకుండా ఎమ్మెల్యేలను కొన్న ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఆరోపించారు. వ్యక్తిగతంగా, నిజాయితీగా పనిచేసే తమ లాంటి వ్యక్తుల  క్యారెక్టర్ ను బ్యాడ్ చేయడం మంచి పద్ధతి కాదని చెప్పారు. వంద మంది ఎమ్మెల్యేలు డబ్బు, అధికారాన్ని దుర్వినియోగం చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని ఉప ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు. ప్రజల మైండ్ ను డైవర్ట్ చేయడానికే బీజేపీ పైన ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.