జమ్మికుంట, వెలుగు: కరీంనగర్ జిల్లాలోని ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం సీతారాముల కల్యాణం కనులపండువగా జరిగింది. వేద పండితులు వంశీధరాచార్యుల ఆధ్వర్యంలో ఎదుర్కోలు అనంతరం కల్యాణాన్ని ప్రారంభించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ ఆలం, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్‌బాబు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు.
మధ్యాహ్నం 12 .22 గంటలకు జీలకర్ర బెల్లం, 12.31 గంటలకు మాంగల్యధారణ చేశారు. అనంతరం జమ్మికుంట రైస్, కాటన్ మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో అడిషనల కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, ఆర్డీవో రమేశ్‌బాబు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్, ఇల్లందకుంట ఆలయ చైర్‌పర్సన్ ఇంగిలి రామారావు, హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, జమ్మికుంట చైర్‌పర్సన్ ప్రశాంత్‌కుమార్ పాల్గొన్నారు.
కరీంనగర్ మహాశక్తి ఆలయంలో..
కరీంనగర్, వెలుగు: కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో శుక్రవారం సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకలకు కేంద్రమంత్రి బండి సంజయ్ -అపర్ణ దంపతులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు 20 వేల మంది భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.
