మొక్కులతో దందా!.. అన్నారం దర్గాలో యాట కోయాలన్నా, గుండు గీయాలన్నా బలవంతపు వసూళ్లు

మొక్కులతో దందా!.. అన్నారం దర్గాలో యాట కోయాలన్నా, గుండు గీయాలన్నా బలవంతపు వసూళ్లు
  • కందూరు టికెట్​కు రూ.300 పెట్టినా, మరో రూ.1,000 చదివియ్యాల్సిందే
  • గుండుకు రూ.50 అయితే, ఎక్స్ట్రా రూ.100
  • వాహన పూజకు రూ.200, అదనంగా మరో రూ.1000 
  • రేపటి నుంచి 3 రోజుల పాటు దర్గా ఉత్సవాలు

వరంగల్/ పర్వతగిరి, వెలుగు: వరంగల్‍ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ దర్గాకు భక్తులు ఎంతో నమ్మకంతో కులమతాలకు అతీతంగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఇదే అదనుగా భావించే అక్కడ పనిచేసే సిబ్బంది, ప్రైవేట్‍ వ్యక్తులతో కలిసి భక్తులను దోపిడీ చేస్తున్నారు. యాట, కోడి కొనుగోలు ఖర్చుకంటే వాటిని కోయడానికి (కందూరి/ఫతేహ్) ఖర్చు డబుల్ అవుతోంది. గుండు గీయించడానికి, ఆటోపూజకు అధికారిక టికెట్‍ కొనుగోలు చేసినా మళ్లీ మూడొంతులు బలవంతంగా వసూలు చేస్తున్నారు.

ఈ క్రమంలో రేపటి నుంచి దర్గా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమ వసూళ్లు మరింత పెరిగే అవకాశముంది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ వసూళ్లు ఆపేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

కాంట్రాక్టర్ పెట్టుకున్నదే టికెట్ల ధర..

అన్నారం దర్గా వక్ఫ్​ బోర్డు పరిధిలో ఉంది. కాగా, మెయింటెనెన్స్​ పేరుతో దాదాపు రూ.2 కోట్ల 10 లక్షలకు ఏటా బయటి వ్యక్తులకు కాంట్రాక్ట్ అప్పగిస్తున్నారు. ఆపై వారి సిబ్బంది నిర్ణయించిన ధరలే అమలవుతున్నాయి. భక్తులు ప్రధానంగా యాట ఫతేహ్ (కందూరి) రూ.300, కోడి అయితే రూ.50, తలనీలాలు రూ.50, కొబ్బరికాయ కొట్టడం రూ.5, వాహన పూజలు ఫోర్‍ వీలర్‍ రూ.200, త్రీ వీలర్‍ రూ.150, టూ వీలర్‍ రూ.100 ఉండగా, వాహన పూజ, జెండా శిలాప్‍ వంటి ఇతర సేవల కోసం తీసుకునే టిక్కెట్‍ డబ్బులు అతడికే చెందుతాయి. ఇవేగాక భక్తులు కందూరి సందర్భంగా యాట తలకాయ, కాళ్లు, బోటి, తోలు మొత్తం వీరికే అందించే నిబంధన పెట్టుకున్నారు. నిత్యం దాదాపుగా వచ్చే 100_120 యాట తలకాయ, బోటికాళ్లను బయట మార్కెట్లో రూ.800 నుంచి రూ.1200 చొప్పున విక్రయిస్తున్నారు.

 అన్నారంలో యాకూబ్ షావలి బాబా దర్గాతోపాటు గౌస్ పాక్, మహబూబీ మా, గుంశవాలి, బోలె సావాలి దర్గాలున్నాయి. యాకూబ్ బాబా దర్గాను వక్ఫ్ బోర్డు అధికారులు ఏటా టెండర్ ద్వారా కాంట్రాక్టర్​కు అప్పగిస్తున్నారు. చిన్న దర్గాలు ముజావర్ల ఆధీనంలో ఉన్నాయి. వక్ఫ్​ బోర్డు జీతాలతో భక్తులకు పూజలు అందించాల్సిన పలువురు సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని వసూళ్లు చేస్తున్నారు.

భక్తులు యాటతో కందూరి చేసే క్రమంలో ముజావర్ల పూజ కోసం టిక్కెట్ల రూపంలో రూ.300 పెట్టాగా, అదనంగా అక్కడుండే హుండీల్లో యాట అయితే రూ.500 నుంచి రూ.1000 వరకు వేయాల్సిందే. కోడి అయితే రూ.150 నుంచి రూ.200 ఇస్తేనే మొక్కు (ఫతేహ్) చేస్తున్నారు. రూ.100లోపు ఉండే ముడుపు కొబ్బరికాయకు రూ.500, వాహన పూజలకు కాంట్రాక్టర్ టికెట్‍ ధర రూ.100 నుంచి రూ.200 ఉండగా, ప్రైవేట్‍ వ్యక్తుల ద్వారా అదనంగా రూ.500 నుంచి రూ.1000 వసూలు చేస్తున్నారు. కందూరి చేయడానికి హలాల్‍ చేసేందుకు కోడికి రూ.50, యాటకు రూ.150 వసూలు చేస్తున్నారు.

ఈ నెల 5 నుంచి ఉర్సు..

ఈనెల 5 నుంచి 8 వరకు అన్నారం ఉర్సు ఉత్సవాలు నిర్వహణ ఉంటుందని వక్ఫ్​ బోర్డు ఇన్​స్పెక్టర్​ రియాజ్‍ తెలిపారు. 5 న గంధం, 6న దీపారాధన, అన్నదానం 7న ఖత్‍ముల్‍ ఖురాన్‍తో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ అధికారులు వరంగల్‍, హనుమకొండ, కరీంనగర్‍, ఖమ్మం, తొర్రూర్‍, నర్సంపేట, కొత్తగూడెం, గోదావనిఖని, మంచిర్యాల, నల్గొండ డిపోల నుంచి బస్సులు నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. 

వక్ఫ్​ బోర్డు పరిధిలోనూ అవే వసూళ్లు..

అన్నారం దర్గా టెండర్ అంటే కాంట్రాక్టర్లు పోటీ పడుతున్నారు. 2017-–18లో కాంట్రాక్ట్​ అమౌంట్‍ రూ.83 లక్షలు ఉండగా, 2018-–19లో రూ.95 లక్షలు.. తీరా 2024_25 ఏడాది వచ్చేసరికి రూ.2 కోట్ల 13 లక్షల 45 వేలకు చేరింది. కాంట్రాక్టర్‍ దక్కించుకున్నోళ్లు భక్తులను ఇష్టారీతిన దోపిడీ చేస్తున్నారనే అపవాదు ఉంది. దీంతో దర్గా నిర్వహణ డైరెక్టుగా వక్ఫ్​బోర్డు అధికారులే చూడాలనే డిమాండ్‍ రావడంతో టెండర్‍ గడువు ముగిసి 7 నెలలు అవుతున్నా కొత్తవారికి అవకాశమివ్వలేదు.

అయితే, గతంలో కాంట్రాక్టర్‍ వక్ఫ్​ బోర్డుకు రూ.2 కోట్ల 13 లక్షలు చెల్లించిన క్రమంలో వాటిని తిరిగి రాబట్టుకోడానికి ప్రైవేటు వ్యక్తులతో అదనపు వసూళ్లు చేస్తున్నారు. ప్రస్తుతం వక్ఫ్​ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహణలోనూ అవే ధరలు, అదనపు వసూళ్ల తీరు మారలేదు. ప్రతిరోజు లక్షలాది రూపాయలు పక్కదారి పడుతున్నాయి.