వ్యాక్సిన్ వేయించుకున్న అంగన్​వాడీ టీచర్​ కు అస్వస్థత

వ్యాక్సిన్ వేయించుకున్న అంగన్​వాడీ టీచర్​ కు అస్వస్థత

గద్వాల, వెలుగు: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న అంగన్​వాడీ టీచర్ అస్వస్థతకు గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా పట్టణంలోని 17వ వార్డు అంగన్​వాడీ టీచర్ గా పని చేస్తున్న లక్ష్మీదేవి(42) జనవరి 19న కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్​ వేయించుకున్న రోజు కొద్దిగా తలనొప్పి, జ్వరం వచ్చింది. తర్వాత పరిస్థితి నార్మల్​గానే ఉంది. నాలుగు రోజుల కింద సడన్​గా ఆమె అస్వస్థతకు గురైంది. తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతూ గద్వాల గవర్నమెంట్ ఆస్పత్రికి వెళ్లింది. పరిశీలించిన డాక్టర్లు మెరుగైన చికిత్స కోసం కర్నూల్ కు రెఫర్ చేశారు. ప్రస్తుతం కర్నూల్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. రోజురోజుకు ఆరోగ్యం విషమిస్తున్నదని, ప్రస్తుతం కాళ్లు, చేతులు పని చేయడం లేదని లక్ష్మీదేవి భర్త తిరుమలేష్ చెప్పారు. ప్రస్తుతం ఆమె వేరే రాష్ట్రంలో చికిత్స పొందుతుండడంతో మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్​లోని నిమ్స్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

వ్యాక్సిన్​ ఎఫెక్ట్​ లేదు

అంగన్​వాడీ టీచర్ లక్ష్మీదేవి అస్వస్థతకు గురైన విషయం వాస్తవమేనని గద్వాల ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్​డాక్టర్ శోభారాణి అన్నారు. ప్రస్తుత నివేదిక ప్రకారం 90% వ్యాక్సినేషన్ ఎఫెక్టు లేదని, ఇతర వేరే కారణాల వల్ల ఆమె అస్వస్థతకు గురై ఉండొచ్చన్నారు. అయినప్పటికీ ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు వెంటిలేషన్ ఉన్న అంబులెన్స్ లో హైదరాబాద్​కు తరలిస్తామని, ఎగ్జామినేషన్ చేసిన తర్వాత పూర్తి వివరాలు
తెలుస్తాయన్నారు.