
వర్షాలు.. వర్షాలు.. వర్షాలు.. 15 రోజులుగా తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. ఎండ చూసి ఎన్నాళ్లు అయ్యింది అన్న ఫీలింగ్ లోకి వచ్చేశారు జనం.. ఇలాంటి సమయంలో మరో పిడుగులాంటి వార్త.. బంగాళాఖాతంలో ఒకటి కాదు.. రెండు పడ్డాయి. ఒకటి అప్పపీడనం.. మరొకటి ఉపరితల ఆవర్తనం.. ఈ రెండింటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో.. రాబోయే మూడు రోజులు అంటే.. 2024, సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఏపీ, దక్షిణ ఒడిశా తీరం దగ్గర.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇదే సమయంలో సముద్ర మట్టం నుంచి 8 కిలోమీటర్ల ఎత్తున నైరుతి దిశలో.. ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. ఇప్పటి వరకు అల్పపీడనం మాత్రమే అనుకుంటే.. ఇప్పుడు ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడటంతో.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు హెచ్చరించింది వాతావరణ శాఖ.
Also Read :- చేపలు పట్టడానికి వెళ్లి వ్యక్తి గల్లంతు గంటల తరబడి గాలిస్తున్న పోలీసులు
వీటి ప్రభావంతో.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. సెప్టెంబర్ 6వ తేదీ కొన్ని చోట్ల.. అక్కడక్కడ భారీ వర్షాలు నమోదు కానున్నాయి. 7వ తేదీ, 8వ తేదీ మాత్రం మోస్తరు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని సూచించింది.
రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ అయితే ఏమీ లేవు. భారీ వర్షాలు పడకపోయినా.. మోస్తరు వర్షాలు అయితే పడతాయని.. కుండపోత వర్షాలు పడే అవకాశం లేదని స్పష్టం చేసింది వాతావరణ శాఖ.