బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. తెలంగాణలో మరో ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. తెలంగాణలో మరో ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

తెలంగాణకు రాబోయే వారం రోజులపాటు  విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని  వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ 23, 24, 25న  కొన్ని జిల్లాలలో  అక్కడక్కడ భారీ  వర్షాలు..26,27 న భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం  ఉందని తెలిపింది.  భారీ వర్షాల హెచ్చరికతో  జిల్లా అధికారులను, యంత్రాంగంతో పాటు  నగరంలోని అధికారులను జీహెచ్ఎంసీ, హైడ్రా, మాన్ సూన్, డీఆర్ఎఫ్ బృందాలను అలెర్ట్ చేసింది వాతావరణశాఖ. 

 21 జిల్లాలకు  ఎల్లో అలెర్ట్ 

సెప్టెంబర్ 23న   తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భూవనగిరి, రంగారెడ్డి హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో  అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి. మీ)తో కూడిన వర్షాలు  అన్ని జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది

సెప్టెంబర్ 24   వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.  సెప్టెంబర్ 25  నాటికి తూర్పు మధ్య  బంగాళాఖాతం దాని సమీపంలోని ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది.

 తదుపరి ఆ అల్పపీడనం పశ్చిమ వాయువ్యదిశలో కదిలి వాయువ్య దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో దక్షిణ ఒడిస్సా ఉత్తర ఆంధ్ర కోస్తా తీరం సమీపంలో సెప్టెంబర్  26వ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.  తదుపరి ఈ వాయుగుండం దక్షిణ ఒడిస్సా ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో  సెప్టెంబర్  27 నాటికి తీరాన్ని దాటే అవకాశం ఉంది.  దీంతో 26, 27 నా భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.